కామన్వెల్త్ ఫైనల్ డే ఫుల్ ఫోకస్.. జూడో, సైక్లింగ్‌లో మెడల్స్ వేటకు రెడీ

కామన్వెల్త్ ఫైనల్ డే ఫుల్ ఫోకస్.. జూడో, సైక్లింగ్‌లో మెడల్స్ వేటకు రెడీ

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games 2026) ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం (ఆగస్టు 2) జరగనున్న ఆఖరి రోజు పోటీల్లో భారత క్రీడాకారులు జూడో (Judo), ట్రాక్ అండ్ పారా సైక్లింగ్ (Track & Para Cycling) విభాగాల్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. కొన్ని క్రీడా విభాగాలే ఉన్నప్పటికీ, భారత్ ఇప్పటి వరకు ఏకంగా 39 పతకాలతో (13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు) పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచి అద్భుత ప్రదర్శన కనబరిచింది.

ప్రతీ భారతీయుడికి గర్వకారణం: పిటీ ఉష
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల సంచలన ప్రదర్శనపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ప్రెసిడెంట్ పిటి ఉష హర్షం వ్యక్తం చేశారు. ఇది మన దేశానికి, ప్రతీ భారతీయుడికి ఎంతో గర్వకారణమైన క్షణం.. ముఖ్యంగా బాక్సింగ్‌లో మన క్రీడాకారులు వరుసగా పసిడి పతకాలు సాధించి జనగణమన గీతాన్ని మారుమోగించడం వర్ణించలేని అనుభూతినిచ్చింది అని పిటి ఉష కొనియాడింది. 

ఫైనల్ రోజు భారత షెడ్యూల్: 

జూడో (Judo):
* మహిళల -78 కేజీల విభాగం (రౌండ్ ఆఫ్ 16): ఇష్రూప్ నారంగ్ vs నికోల్ వుడ్ (స్కాట్లాండ్).
* పురుషుల -100 కేజీల విభాగం (రౌండ్ ఆఫ్ 16): అవతార్ సింగ్ vs అరిస్టోస్ మైకేల్ (సైప్రస్).
* పురుషుల +100 కేజీల విభాగం (రౌండ్ ఆఫ్ 16): యాష్ ఘంగాస్ vs జాషువా వైట్‌హౌస్ (వేల్స్).

ట్రాక్ అండ్ పారా సైక్లింగ్: 
* పురుషుల 40 కిలో మీటర్ల పాయింట్స్ రేస్ (తొలి రౌండ్): దినేష్ కుమార్, హర్ష్‌వీర్ సింగ్ సేఖాన్ బరిలోకి దిగుతారు. క్వాలిఫై అయితే రాత్రి 9:09 గంటలకు జరిగే ఫైనల్‌లో పోటీపడతారు.
* పురుషుల 1000 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్ (పతక పోరు): భారత స్టార్ సైక్లిస్ట్ రొనాల్డో సింగ్ లైటోంజమ్ పతకం కోసం పోరాడనున్నాడు.
* మహిళల C4-C5 1000 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్ (పతక పోరు): పారా సైక్లింగ్‌లో లిషా దాస్ భారత్ తరఫున రేసులో నిలవనుంది.