పేద క్రైస్తవులకు కుట్టు మెషీన్లు, ఈ-బైక్‌‌‌‌లు ..ఆర్థిక సాయం చేయనున్న క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్

పేద క్రైస్తవులకు కుట్టు మెషీన్లు, ఈ-బైక్‌‌‌‌లు ..ఆర్థిక సాయం చేయనున్న క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్
  •  మొత్తం 2,750 మందికి ఇవ్వాలని నిర్ణయం
  • ఇప్పటికే 10 వేల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు : పేద క్రైస్తవ కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ క్రిస్టియన్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. క్రిస్టియన్ల సంక్షేమం కోసం సబ్సిడీ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా కుట్టు మెషీన్లు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయంతో పాటు పెట్రోల్, ఈ–బైక్ వాహనాలను పంపిణీ చేయనుంది. ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు గడువు గత నెల 31తో ముగిసింది. 

మొత్తం 2,750 మందికి ఇవ్వాలని నిర్ణయించగా సుమారు 10 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కుట్టు మెషీన్లకు 2,700, చిన్న వ్యాపారాలకు 3,300, ఈ–స్కూటర్లు, ఈ–బైక్‌‌‌‌లకు 2 వేల చొప్పున అప్లికేషన్లు వచ్చాయి. భారీ స్థాయిలో దరఖాస్తులు రావడంతో త్వరలోనే స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అర్హులైన పేదలకు ప్రాధాన్యతనిస్తూ 2,750 మందిని కలెక్టర్లు ఎంపిక చేసి త్వరలోనే యూనిట్లను అందజేయనున్నారు.