IPL 2026: మార్ష్ ఊర మాస్ బ్యాటింగ్.. చెన్నైను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన లక్నో

IPL 2026: మార్ష్ ఊర మాస్ బ్యాటింగ్.. చెన్నైను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన లక్నో

లక్నో: సొంత గడ్డపై లక్నో ఘన విజయం సాధించింది. ఛేజింగ్‎లో మిచెల్ మార్ష్ (90) ఊర మాస్ బ్యాటింగ్‎‎తో చెలరేగడంతో చెన్నైను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది లక్నో. కీలక పోరులో బౌలర్లు చేతులేత్తేయడంతో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది చెన్నై. ఈ ఓటమితో నెక్ట్స్ ఆడబోయే రెండు మ్యాచుల్లో గెలిస్తేనే చెన్నై ఫ్లే ఆఫ్స్ చేరుకుంటుంది. 

ఈ మ్యాచులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 187/5 స్కోర్ చేసింది. యంగ్ బ్యాటర్ కార్తీక్ శర్మ (71) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే (32) ఫర్వాలేదనిపించాడు. చెన్నై నిర్ధేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలోనే ఛేధించింది. జోష్ ఇంగ్లీస్ (36), పూరన్ (32) రాణించారు. మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.  

కార్తీక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్.. 

ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకు శుభారంభం దక్కలేదు. యంగ్ బౌలర్ ఆకాష్ సింగ్ చెన్నైకు ఆదిలోనే షాకిచ్చాడు. వరుస ఓవర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (13), సంజు శాంసన్ (20), ఉర్విల్ పటేల్ (6)ను ఔట్ చేశాడు. ఆకాష్ సింగ్‎తో పాటు లక్నో బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో చెన్నై 37 పరుగులు మాత్రమే చేసింది.

ఈ దశలో జతకట్టిన కార్తీక్ శర్మ, డేవాల్డ్ బ్రేవిస్ ఇన్నింగ్స్‎ను గాడినపెట్టారు. స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ వికెట్ పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బ్రేవిస్ (25)ను ఔట్ చేసి ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని మహ్మద్ షమీ విడదీశాడు. 

ఒకవైపు వికెట్లు పడుతున్నా కార్తీక్ శర్మ మాత్రం దూకుడు తగ్గించలేదు. 42 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 71 రన్స్ చేసి వెనుదిరిగాడు. చివర్లో ప్రశాంత్ వీర్ (13)తో కలిసి శివమ్ దూబే (32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్‎లో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు దూబే. దీంతో చెన్నై 180 పరుగుల మార్క్ చేరుకుంది. 

మార్ష్ మాస్ బ్యాటింగ్

మిచెల్ మార్ష్ ఊచకోతతో 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలోనే ఛేధించింది. మార్ష్ ఆకాశమే హద్దుగా చేలరేగాడు. కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సులతో 90 పరుగులు చేసి చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు మార్ష్. మరో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ (36) సైతం బ్యాట్ ఝుళిపించాడు. అబ్దుల్ సమద్ (7) విఫలం అయ్యాడు. అయినప్పటికీ ఓపెనర్స్ విధ్వంసంతో మ్యాచ్ పూర్తిగా లక్నో వైపే ఉండగా.. చివర్లో పూరన్ (32), ముకుల్ (13) చౌదరి మిగితా లాంఛనాన్ని పూర్తి చేశారు. చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి, స్ఫెన్సర్ జాన్సన్ చెరో వికెట్ తీశారు.