ఇది సేమ్ బాబ్రీ మసీద్ తీర్పే.. సుప్రీం కోర్టుకు పోతం: భోజ్‎శాల తీర్పుపై ఓవైసీ రియాక్షన్

ఇది సేమ్ బాబ్రీ మసీద్ తీర్పే.. సుప్రీం కోర్టుకు పోతం: భోజ్‎శాల తీర్పుపై ఓవైసీ రియాక్షన్

హైదరాబాద్: మధ్యప్రదేశ్‎లోని వివాదాస్పద భోజ్‌శాల కట్టడాన్ని సరస్వతీ దేవి ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. భోజ్‌శాలను హైకోర్టు సరస్వతీ దేవి ఆలయంగా గుర్తించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు అయోధ్యలోని బాబ్రీ మసీదు తీర్పును పోలి ఉందని అభివర్ణించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. ఈ తీర్పును సుప్రీం కోర్టు రద్దు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్ షహర్ ఖాజీ వకార్ సాదిక్ కూడా మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేస్తామని చెప్పారు.

ఇంతకీ భోజ్ శాల వివాదం ఏంటంటే..? 

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల ఒక చారిత్రక కట్టడం. దీని యాజమాన్యం, మతపరమైన హక్కులపై హిందూ, ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. భోజ్ శాల సరస్వతి దేవాలయమని హిందూ సంఘాలు.. కమల్ మౌలా మసీదని ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి. ఈ వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టులో కొన్నేండ్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) 2003 ఏప్రిల్ 7న ఒక ఉత్తర్వు జారీ చేసింది.

దీని ప్రకారం హిందువులు ప్రతి మంగళవారం భోజ్ శాలలో పూజలు చేసుకోవచ్చు.. ముస్లింలు ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకోవచ్చు. అయితే, ఏఎస్ఐ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హిందూ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. భోజ్ శాల ప్రాంగణంలో తమకు ప్రత్యేక పూజ హక్కులను కల్పించాలని కోరాయి. 

మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ అలోక్ అవస్థిలతో కూడిన డివిజన్ బెంచ్ భోజ్ శాల కట్టడం వివాదానికి సంబంధించిన ఐదు పిటిషన్లు, ఒక రిట్ అప్పీల్‌పై 2026, ఏడాది ఏప్రిల్ 6న సాధారణ విచారణలను ప్రారంభించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత.. ఏఎస్ఐ నివేదిక, చారిత్రక రికార్డులను ఆధారంగా చేసుకుని 2026, మే 15న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణం హిందూ దేవాలయమే అని చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.