- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి/జన్నారం, వెలుగు: వరి, మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. శుక్రవారం దండేపల్లి మండల కేంద్రం, జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతుల అవసరాలకు సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, కాంటాలు, హమాలీలను సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.
తూకం వేసిన బస్తాలను వెంటనే ట్యాగ్ చేసి రైస్ మిల్లులకు తరలించాలని చెప్పారు. లారీలు అందుబాటులో ఉన్నాయని, ఏదైనా సమస్య ఉంటే స్థానిక తహసీల్దార్‌కు తెలియజేయాలని సూచించారు. అనంతరం లింగాపూర్‌లోని రామ్ లక్ష్మణ్ రైస్ మిల్ గోదామును పరిశీలించి ధాన్యం దిగుమతిపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎంపీడీఓ జె.ఆర్. ప్రసాద్ ఉన్నారు.
