పంటసేకరణ సమస్యలు తీరేదెన్నడు?

పంటసేకరణ సమస్యలు తీరేదెన్నడు?

1965లో జాతీయ ఆహార సంస్థ మొదలుపెట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం పంటల సేకరణ మొదలు పెట్టింది.  దాదాపు 60 ఏండ్లకుపైగా అనుభవం ఉన్నా రైతుల నుంచి పంటల సేకరణ రానురాను మెరుగుకాకుండా దిగజారుతున్న  పరిస్థితిని చూస్తున్నాం.   కేంద్ర,  రాష్ట్ర  ప్రభుత్వాలు చేపడుతున్న పంటల సేకరణ  ప్రహసనంగా మారి రైతులకు శోకం మిగిలిస్తోంది.  రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు  రాజకీయానికి ఇది ఒక వస్తువుగా మారింది.  

సేకరణ కేంద్రాల ప్రారంభోత్సవాలు ఒకవైపు,  రాస్తారోకోలు  ఇంకొకవైపు  ఇటు పక్క ఉన్న రాజకీయులు అటు పక్కకు,  అక్కడ ఉన్నవారు ఇటు పక్కకు మారుతున్నారు  తప్పితే,  రైతులు మాత్రం సంతోషంగా లేరు. వాళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు.  పంటల సేకరణ వ్యవస్థ మాత్రం ఏటా దిగజారుతున్నది.  వివిధ  పంటలు  ప్రభుత్వ కొనుగోలుకు జాతీయ ఆహార సంస్థ (ఎఫ్​సీఐ)తోపాటు  ఇప్పుడు జాతీయ స్థాయిలో కనీసం నాలుగు సంస్థలు ఉన్నాయి.  రాష్ట్రస్థాయిలో  రెండు ఉన్నాయి.   60  ఏండ్ల నుంచి వరి, గోధుమలు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఈ వ్యవస్థను  మెరుగుపరచడంలేదు.  

ఎఫ్​సీఐ  కేవలం వరి, గోధుమల పైన దృష్టి సారిస్తుండగా, వివిధ పంటల సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.  వికేంద్రీకృత సేకరణ పథకం కింద, రాష్ట్రాలు వరి, గోధుమలను స్థానికంగా కొనుగోలును, నిల్వలను నిర్వహిస్తూ  కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి తగ్గ చెల్లింపులు అందుకుంటాయి.  అయితే, వివిధ పంటలకు చివరికి కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది కనుక  రాష్ట్ర  ప్రభుత్వాల పాత్ర  పరిమితమే.  రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల మీద  ఒత్తిడి ఉంటుంది.  కొన్ని  రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పంటల కొనుగోలు తమంత తామే చేస్తుండగా,  కేంద్ర ప్రభుత్వం మాత్రం వరి, గోధుమలు, అప్పుడప్పుడు ప్రత్తి, కొన్ని రకాల పప్పులకు పరిమితం అయ్యింది. నూనె పంటల కొనుగోలు ఇదివరకు ఉండేది. ఈ పంటల కొనుగోలు కూడా తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏనాటినుంచో ప్రయత్నం చేస్తున్నది.

  • ప్రపంచ వాణిజ్య శక్తుల ఒత్తిడి

ఈ ప్రయత్నాలు  ఆర్థిక విధానాల వల్లనే కాకుండా అదనంగా ప్రపంచ వ్యవసాయ వాణిజ్య శక్తుల ఒత్తిడి కూడా ఉన్నది.  ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత ప్రభుత్వం మీద ఈ విషయంగా అనేక రకాల ఒత్తిడులు ఉన్నాయి. ప్రభుత్వ కొనుగోళ్ళు ఆపాలని,  మార్కెట్ శక్తులకు అన్ని వ్యవసాయ ఉత్పత్తులు వదిలిపెట్టాలని సరళీకృత ఆర్థిక విధానంలో ఒక బలమైన వాదన.  దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, కూటమి వాణిజ్య ఒప్పందాలలో కూడా ఆయా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి క్రయ,  విక్రయ ఒప్పందాలలో ఉండడంతో వాటి ప్రభావం పంటల కొనుగోలు మీద పడుతున్నది.  ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు, ఆయా వ్యవసాయ ఉత్పత్తులు ముడి సరుకుగా వాడే కంపెనీల ఒత్తిడి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంటల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.   పత్తి కొనుగోళ్లలో ఈ రకమైన శక్తుల ప్రభావం స్పష్టంగా ఉంటున్నది.  ప్రత్తి నూలు తయారీ కంపెనీల దగ్గర నుంచి వస్త్రాలు తయారు చేసే కంపెనీల వరకు ముడి  పత్తి ధర మీద ప్రభావం చూపుతున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు నిర్ణయాలు ఆయా ఒత్తిడుల మేరకే ఉంటుంది. 

  • కేంద్రం నిర్ణయంలో కొరవడిన పారదర్శకత

2021–-22, 2022-–23 సంవత్సరాలలో  కొనుగోలు చేయకపోవటానికి ప్రత్యేక కారణాలు  ప్రభుత్వం ఏనాడూ ప్రకటించలేదు.  మార్కెట్లో కనీస మద్దతు ధర ఎక్కువ ఉన్నది కాబట్టి కొనలేదు అని సాధారణ ప్రకటనలు ఇస్తుంటారు.  ఆ రెండు సంవత్సరాలు  పత్తి కొనుగోలు కేంద్రాలు తెరిచినా కొనుగోళ్లు మాత్రం చేయలేదు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సాంకేతికంగా అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది చిన్న రైతులకు ఆచరణలో అందలేదు.  ఎక్కడైతే  ఎంఎస్పీ కంటే తక్కువగా ధరలు ఉన్నాయో అక్కడ సీసీఐ నాణ్యత  ప్రమాణాలను ఉపయోగించి పత్తిని కొనకుండా తప్పించుకుంది.

  ఎప్పుడు, ఏ పంట,  ఏ పరిమాణంలో కొనుగోలు చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం  పారదర్శకంగా లేదు.   ఏప్రిల్ 2021లో  చేపట్టిన ఎగుమతి  సరళీకరణ  పత్తి  ధరలను పెంచినప్పటికీ,  రైతులు తమ పంటను విక్రయించిన తర్వాతే ఆ పెరుగుదల ప్రధానంగా సంభవించింది.  అయితే,  పత్తి విషయంలో ఎగుమతి,  -దిగుమతుల  నోటిఫికేషన్లు  ఫిబ్రవరి,  మార్చి,  ఏప్రిల్  నెలలలో వస్తాయి.   పత్తి రైతు నుంచి వెళ్లిపోయాక ఈ నిర్ణయాలు ప్రతి ఏటా రావడం  ఆనవాయితీ అయిపోయింది. ఇదే రకం జాడ్యం మక్కలు, జొన్నలు, పప్పులకు కూడా వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. 

  • తెలంగాణలో  కొనుగోళ్లు సమస్యలు

కేంద్ర  ప్రభుత్వం  పరిధిలో  కేవలం  రెండు పంటలు,  అడపాదడపా ఇతర పంటల కొనుగోళ్లు ఉండగా,  తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019-–20 నుంచి 100 శాతం ధాన్యం కొనుగోళ్లు చేస్తామని  ప్రకటించింది. కానీ అప్పటి నుంచి  70 శాతం వరకు మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి.  ఈ  కొనుగోళ్లకు  ఒక విధానం అంటూ  ప్రకటన దాదాపు రెండుసార్లు  ప్రభుత్వం  ప్రకటించినా అది రైతులకు ఎన్నడూ చేరలేదు.  వరి కొనుగోళ్లు   తెలంగాణ  రాష్ట్ర  సివిల్  సప్లైస్  కార్పొరేషన్  ద్వారా మాత్రమే  చేస్తారు.  

అయితే  మొదటి నుంచీ కూడా ఈ  కొనుగోళ్లకు  సంబంధించిన నిధులు బడ్జెట్లో ఎన్నడూ చూపలేదు.  దాదాపు రూ.18 వేల కోట్లతో  మొదలు అయ్యి 2026 నాటికి  రూ.22 వేల కోట్లకు చేరిన ఈ కొనుగోళ్లు తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్లో  కనపడవు.  అప్పటినుంచి లెక్క వేస్తే,  వరి కొనుగోలు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు లక్ష కోట్ల రూపాయలు దాటింది.  సదరు  కార్పొరేషన్ మీద ఉన్న అప్పులు రూ.56 వేల కోట్లు అని 2024  శ్వేత పత్రంలో ప్రభుత్వం ప్రకటించింది.  

  • ఆదాయం పూర్తిగా వరి మీదనే

జాతీయ గణాంక కార్యాలయం  2018–2019 సంవత్సరానికి నిర్వహించిన 'పరిస్థితి అంచనా సర్వే' ప్రకారం..  తెలంగాణలోని ఒక వ్యవసాయ కుటుంబ సగటు నెలవారీ ఆదాయం కేవలం రూ.9,403.  రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం వరి దాదాపు కోటి ఎకరాల పైన సాగు అవుతున్నది. అంటే,  తెలంగాణ రైతుకు ఆదాయం పూర్తిగా వరి మీదనే.  ఇంకా వేరే మార్గాలు లేవు.  కొనుగోళ్లపై  రైతులకు, రైతు సంస్థలకు  ముందుగా ఎలాంటి స్పష్టత ఉండదు. ఈ సమాచార లోపం కారణంగా, రైతులు ఎటువంటి నమ్మకమైన ఆధారం లేకుండా వరి కోత, ఆరబెట్టడం, బస్తాల్లో నింపడం, రవాణా చేయడం వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇది నష్టాలకు దారితీస్తోంది.

  • అన్ని పంటలు కొనుగోళ్లు చేయాలి

వరి సేకరణ అనేది ప్రభుత్వ బాధ్యత, దీని ప్రభావం లక్షలాది మంది ఆహార భద్రత, ఆర్థిక సంక్షేమంపై ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఇతర రాజ్యాంగ విధులతో సమానమైన ప్రాధాన్యతతో దీనిని పాలకులు పరిగణించాలి.  ప్రభుత్వం గత 8 ఏండ్లుగా పెడుతున్న ఖర్చు మీద ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్నది.  వరి సేకరణలో,  కొనుగోళ్లలో  అవినీతిని తగ్గించాలంటే పారదర్శకత అవసరం.  జిల్లా కలెక్టర్లు,  రైతు ప్రతినిధులతో కూడిన కమిటీ ద్వారా  వరి కొనుగోళ్లు  చెయ్యాలి.  పంట కొనుగోళ్ల మీద ఒక సమగ్ర నివేదిక శాసనసభకు అందజేయాలి.  పంట కొనుగోళ్లు  ఒక వరికే  పరిమితం చెయ్యకుండా పసుపు, జొన్నలు, నూనె పంటకు, ఇంకా ఇతర పంటలకు  విస్తరించాలి.  అప్పుడే తెలంగాణ రైతులకు సరి అయిన ఫలితాలు అందుతాయి.

  • వరి సేకరణ అనేది ప్రభుత్వ బాధ్యత

వరి ధాన్యం తూకంవేసి,   రసీదు జారీ చేసిన తర్వాత, ఆ ధాన్యానికి సంబంధించి రైతుకు ఎటువంటి బాధ్యతా ఉండకూడదు.  అధికారిక  స్వీకరణ జరిగిన తర్వాత సంభవించే ఎటువంటి నష్టం,  చెడిపోవడం,  ఇతర ధాన్యంతో కలిసిపోవడం  లేదా దొంగతనం వంటి వాటికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సేకరణ విధానంలో ఈ సూత్రం లోపించింది. ‘తరుగు’  అంటే,  వేబ్రిడ్జ్ రీడింగ్‌‌‌‌ను కృత్రిమంగా తగ్గించడం లేదా బస్తాలలో నింపేటప్పుడు లేదా తూకం వేసేటప్పుడు వరి ధాన్యాన్ని కొంత పక్కకు తీయడం  అనేది సేకరణ వ్యవస్థలో రైతులను దోపిడీ చేసే అత్యంత వ్యవస్థీకృతంగా మారింది.  

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.