సిమ్లా: చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరింగా సాగిన పోరులో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ (75) కిరాక్ ఇన్నింగ్స్‌తో పాటు విల్ జాక్స్ (25) మెరుపులు మెరిపించడంతో పంజాబ్‌పై కింగ్స్ 6 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. ఈ మ్యాచులో ఓటమి పాలుకావడంతో లీగ్‌లో పంజాబ్ వరుసగా ఐదో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో ఫ్లే ఆఫ్స్ ఆశలను అయ్యర్ సేన క్లిష్టం చేసుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (57) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ప్రియాంష్ ఆర్య (22), కన్నోలి (21), ఓమర్జాయ్ (38) రాణించారు. పంజాబ్ నిర్ధేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో బంతి మిగిలి ఉండగానే ఛేధించింది. తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెల్చుకున్నాడు.
ఆకట్టుకున్న ప్రభ్‌సిమ్రాన్‌సింగ్.. చివర్లో రాణించిన మిడిలార్డర్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్స్ ప్రియాంష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రాన్‌సింగ్ (57) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 50 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ దశలో దీపక్ చాహర్ అద్భుతమైన బంతికి ప్రియాంష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కూపర్ కన్నోలి (21) ప్రభ్సిమ్రాన్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వేగంగా ఆడే క్రమంలో శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔట్ అయ్యారు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అయ్యర్ పూర్తిగా నిరాశపర్చాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఇన్ఫామ్ బ్యాటర్ కన్నోలి (21) కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఇక్కడి నుంచి ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూర్యాంష్ షెడ్జ్ (8), శశాంక్ సింగ్ (2), మార్కో యాన్సెన్ (2) వరుసగా వికెట్లు కోల్పోయారు. దీంతో పంజాబ్ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ చివర్లో ఓమర్జాయ్ (38), విష్ణు వినోద్ (15) , బార్ట్లెట్ (18) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 200 పరుగుల మార్క్ చేరుకుంది.
తిలక్ , జాక్స్ కిరాక్ ఇన్నింగ్స్
201 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ కు ఘన ఆరంభం లభించింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (48) పంజాబ్ బౌలర్లను ఊతికారేశాడు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో అజ్మతుల్లా ఓమర్జాయ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నమన్ధీర్ (9) విఫలమయ్యాడు. రోహిత్ శర్మ (25) ఫర్వాలేదనిపించాడు. ఈ దశలో జతకట్టిన రూథర్ ఫోర్డ్ (20), తిలక్ వర్మ మెల్లగా ఇన్నింగ్స్ ను ముందు తీసుకెళ్లారు. మొదట స్లోగా ఆడిన తిలక్ వర్మ 15 ఓవర్ తర్వాత విశ్వరూపం చూపించాడు.
పంజాబ్ బౌలర్లపై విరుచుపడి బౌండరీల వర్షం కురిపించాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. రూథర్ ఫోర్డ్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్ రెచ్చిపోయి ఆడాడు. కేవలం 10 బంతుల్లోనే 25 రన్స్ చేశాడు. తిలక్, జాక్స్ మెరుపులతో మరో బంతి మిగిలి ఉండగానే ముంబై లక్ష్యాన్ని ఛేధించింది. పంజాబ్ బౌలర్లలో ఓమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. చాహల్, మార్కో యాన్సెన్ చెరో వికెట్ సాధించారు.
