హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. 2026 మే 14వ రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఫాతిమా (25 ) అనే మహిళ స్పాట్ లోనే మృతి చెందింది. చంద్రాయణగుట్ట లో జరిగిన ఈ హిట్ అండ్ రన్ తో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ యాక్టివాపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫాతిమా ప్రయాణిస్తున్న బైక్ ను టిప్పర్ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో మహిళ స్పాట్ లోనే చనిపోయింది. అదే బండి పై ఉన్న భర్త, ఇద్దరు అల్లుండ్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఫాతిమా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. స్థానికంగా ఒక వివాహానికి హాజరై వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఫాతిమా దంపతులుకు మూడు నెలల క్రితమే వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు. అంతలోనే ఘోరప్రమాదం జరగటం తీవ్ర విషాదం నింపింది. బైకుపైన భర్తతో పాటు భర్త సోదరి పిల్లలు (అల్లుండ్లు) ఉండగా.. ప్రమాదం నుంచి భర్త అల్లుండ్లు సురక్షితంగా బయటపడ్డారు.
