వేధింపులకు గురైన విద్యార్థినికి పరీక్ష రాసే అవకాశం..

వేధింపులకు గురైన విద్యార్థినికి పరీక్ష రాసే అవకాశం..
  • గద్వాల విజయలక్ష్మి విజ్ఞప్తికి కాలేజీ అంగీకారం  

హైదరాబాద్, వెలుగు: మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి చొరవతో  ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి పరీక్ష రాసే అవకాశం దక్కగా, కరీంనగర్ ఆస్పత్రిలో గర్భిణుల సమస్య పరిష్కారమైంది. లైంగిక వేధింపుల కారణంగా మానసిక ఆవేదనకు గురై, అనారోగ్యంతో కాలేజీకి రాలేకపోయిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని పరీక్షలకు అనుమతించాలని మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి కోరారు. అటెండెన్స్ తక్కువగా ఉందన్న కారణంతో కాలేజీ యాజమాన్యం ఆమెను పరీక్షలకు అనుమతించలేదు.

దాంతో విద్యార్థిని చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన విజయలక్ష్మి.. వెంటనే జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ అధికారులు, సదరు కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థిని ఎదుర్కొన్న వేధింపులు, ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, మానవతా దృక్పథంతో పరీక్ష రాసేందుకు చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యాజమాన్యం, విద్యార్థినికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.

అలాగే, కరీంనగర్ ఎంసీహెచ్లో గర్భిణులు, బాలింతలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారన్న వార్తా కథనాలపైనా ఆమె స్పందించారు. జిల్లా వైద్యాధికారులతో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడగా, వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఆస్పత్రిలో అవసరమైన ఏర్పాట్లు చేసి సమస్యను పరిష్కరించారు.