జైలు నుంచే ఎనిమిదేండ్లుగా దోపిడీలు..9 రాష్ట్రాల్లో 70 మంది ప్రొఫెషనల్స్తో  సుబోధ్ గ్యాంగ్ నెట్ వర్క్ 

జైలు నుంచే ఎనిమిదేండ్లుగా దోపిడీలు..9 రాష్ట్రాల్లో 70 మంది ప్రొఫెషనల్స్తో  సుబోధ్ గ్యాంగ్ నెట్ వర్క్ 
  • గతంలో మణప్పురం గోల్డ్, తనిష్క్ షాపుల్లో భారీ దోపిడీలు 
  • తెలంగాణలోకి  తొలిసారిగా ఎంట్రీ 

కరీంనగర్, వెలుగు: దేశంలో ది గోల్డ్ థీఫ్​గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ 8 ఏండ్లుగా జైలు నుంచే దోపిడీలకు పాల్పడుతుండడం పోలీస్ శాఖను షాక్ కు గురిచేస్తోంది. బిహార్​లోని  నలందకు చెందిన సుబోధ్ సింగ్.. 2018లో అరెస్టయి జైలులో ఉన్నాడు. దేశంలోని 9 రాష్ట్రాల్లో 70 మంది ప్రొఫెషనల్స్​తో అతడికి నెట్ వర్క్ ఉంది. మొన్నటి వరకు బిహార్ పట్నా జైలులో ఉన్న అతడిని.. భద్రతా కారణాల వల్ల 4 రోజుల క్రితమే బిహార్​లోని పూర్నియా సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్ని జైళ్లు మార్చినా, అతడిని కలవడానికి వచ్చే వారిపై నిఘా పెట్టినా అతడి ముఠా రాబరీలు ఆగడం లేదు.

నలందలోని చిష్టిపూర్‌‌‌‌కు చెందిన సుబోధ్ సింగ్​ను 1999లో దానాపూర్ రైల్వే స్టేషన్‌‌‌‌లో జీఆర్పీ పోలీసులు ఆయుధాల చట్టం కేసులో తొలిసారి అరెస్టు చేశారు. తర్వాత 2003లో బఖ్తియార్‌‌‌‌పూర్ బైక్ చోరీ కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత 2007లో కలకత్తాలోని వీఐపీ రోడ్డులో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌‌‌‌లో జరిగిన రూ.19 లక్షల దోపిడీలో సుబోధ్ సింగ్ ముఠా ప్రమేయం ఉన్నట్టు తేలింది. ఈ కేసులో అతడిని 2008లో రాంచీలో అరెస్టు చేశారు. బెయిల్‌‌‌‌పై విడుదలయ్యాక తన ముఠాతో 2009లో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని రాయ్‌‌‌‌పూర్‌‌‌‌లో ఎస్‌‌‌‌బీఐలో 20 లక్షలకుపైగా, బెంగాల్‌‌‌‌లోని రాయ్‌‌‌‌గఢ్‌‌‌‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్  బ్రాంచ్ లో రూ.75 లక్షలు దోపిడీకి పాల్పడ్డాడు.

వరుస బ్యాంకు రాబరీలతో సుబోధ్ సింగ్ 2011లో అరెస్ట్ అయ్యాడు. 2016లో  జైలు నుంచి విడుదలయ్యాక రాజస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్‌‌‌‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బెంగాల్, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో బంగారం దోపిడీలకు పాల్పడ్డాడు. 2018లో అరెస్టయి జైలులో ఉంటూనే 2019లో తన ముఠా ద్వారా హజీపూర్, ముజఫర్‌‌‌‌పూర్ ముత్తూట్ ఫైనాన్స్‌‌‌‌లో బంగారు దోపిడీ చేయించాడు. అదే ఏడాది తమిళనాడు, మహారాష్ట్రలోని నాసిక్‌‌‌‌లోనూ ఈ ముఠా బంగారు దోపిడీకి పాల్పడింది.

2023లో మహారాష్ట్రలోని సాంగ్లీలోని రిలయన్స్ జ్యువెలరీ నుంచి  రూ.10 కోట్ల బంగారాన్ని దోచుకుంది. సుబోధ్ సింగ్ డైరెక్షన్​లో ఓ ముఠా 2024 జులై 26న పూర్నియాలోని తనిష్క్ షోరూమ్‌‌‌‌లో రూ.3.70 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకుంది. అంతకుముందు సుబోధ్ ముఠా 2023లో ధంతేరస్ రోజున డెహ్రాడూన్‌‌‌‌లో ఉన్న రిలయన్స్ జ్యువెలరీ దుకాణంలో రూ.20 కోట్ల విలువైన ఆభరణాలను దోపిడీ  చేసింది.  

దేశవ్యాప్తంగా నెట్ వర్క్ 

దేశవ్యాప్తంగా 70 మందితో క్రిమినల్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ కలిగిన సుబోధ్ సింగ్​పై  బిహార్, బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్‌‌‌‌, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. తన అనుచరులకు వేతనాలతోపాటు రాబరీ సక్సెస్ అయితే బోనస్‌‌‌‌లూ ఇస్తుంటాడు. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్‌‌‌‌ తదితర సంస్థల నుంచి 30 కిలోలకు పైగా బంగారం ఈ ముఠా ఎత్తుకెళ్లింది. ఈ  ముఠాకు చోరీ చేసిన మొబైళ్లు, ఎన్‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌ యాప్స్‌‌‌‌(ఫేస్‌‌‌‌టైంతో సహా)తో జైలు నుంచే వీడియో కాల్స్‌‌‌‌ ద్వారా రియల్‌‌‌‌టైం మానిటరింగ్‌‌‌‌ ద్వారా ఆదేశాలు అందుతాయి.