కరీంనగర్ లోని ప్రైవేట్ దవా ఖానాల్లో భద్రత కరువు...ఇటీవల డాక్లర్ల నిర్లక్ష్యంతో పెరిగిన మరణాలు

కరీంనగర్ లోని ప్రైవేట్ దవా ఖానాల్లో భద్రత కరువు...ఇటీవల డాక్లర్ల నిర్లక్ష్యంతో పెరిగిన మరణాలు
  •     కరీంనగర్‌‌‌‌ వన్ ఆస్పత్రి ఘటనతో  ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణపై విమర్శలు 
  •     పట్టించుకోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
  •     పలు ప్రైవేట్ హాస్పిటల్స్, డాక్టర్లపై కేసులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోని ప్రైవేట్ దవఖానాల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వన్ హాస్పిటల్ లో బుధవారం రాత్రి లిఫ్ట్ కేబుల్ తెగి కిందపడడంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌కు తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హాస్పిటల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది. లిఫ్ట్ ప్రమాదంలో చిక్కుకున్నది మంత్రి అని తెలిసి కూడా కనీసం సదరు హాస్పిటల్ డాక్టర్ గానీ,  ఐఎంఏ ప్రతినిధులుగానీ రాకపోవడం, మంత్రికి ఏమైందని విచారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.    

 డాక్టర్ల నిర్లక్ష్యంతో పెరిగిన మరణాలు.. 

కరీంనగర్‌‌‌‌లోని ప్రైవేట్ హాస్పిటళ్లలో డాక్లర్ల నిర్లక్ష్యం కారణంగా పేషెంట్లు చనిపోవడం, మృతుల బంధువులు ఆందోళనకు దిగడం ఇటీవల నిత్యకృత్యంగా మారింది. ఇటీవల మెడికవర్ హాస్పిటల్, యశోదకృష్ణ  హాస్పిటల్స్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి. హాస్పిటళ్లతో పాటు  డాక్టర్లపైనా కేసులు  నమోదవుతున్నాయి. దీంతో కరీంనగర్‌‌‌‌లోని ప్రైవేట్ హాస్పిటళ్లలో వైద్యం అంటే, అందులో సర్జరీలు అంటేనే  జనం భయపడే పరిస్థితి నెలకొంది. 

వన్ ఆస్పత్రికి షోకాజ్‌‌

కరీంనగర్‌‌లోని వన్ ఆస్పత్రిలో జరిగిన లిఫ్ట్ ప్రమాద ఘటనపై కలెక్టర్ చిత్రా మిశ్రా సీరియస్ గా స్పందించారు.  కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ అధికారులు ఆస్పత్రిని సందర్శించి ఘటనకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించారు. లిఫ్ట్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, అత్యవసర సదుపాయాలు, నిర్వహణ రికార్డులపై ఆరా తీశారు. వైద్య నిబంధనల ప్రకారం  డీఎంహెచ్‌‌వో వన్ ప్రైవేటు హాస్పిటల్‌‌ యాజమాన్యానికి గురువారం షోకాజ్​ నోటీసు జారీ చేశారు. 

పోలీస్, ఫైర్ డిపార్ట్​మెంట్ అధికారులు సైతం ఆస్పత్రిలో  తనిఖీలు  నిర్వహించారు. అంతకుముందు ప్రైవేట్ ఆస్పత్రుల్లో భద్రత ప్రమాణాల పర్యవేక్షణకు పోలీస్, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యశాఖ అధికారులతో  కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కమిటీ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించనుంది. ప్రైవేట్​ హాస్పిటల్‌‌ మేనేజ్​మెంట్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని, లిఫ్ట్‌‌లు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మార్గాలు, సాంకేతిక పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. 

ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీపై విచారణ జరపాలి: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

కరీంనగర్ పట్టణంలో ఎలాంటి అనుభవం లేకుండా విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు  డాక్టర్ మేడిపల్లి సత్యం కలెక్టర్‌‌‌‌కు గురువారం లెటర్​రాశారు. కరీంనగర్‌‌లో చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సదుపాయాలు అత్యంత దయనీయంగా ఉన్నాయని, అర్హత లేని డాక్టర్లు, తక్కువ జీతాలకు సిబ్బందిని పెట్టుకుని వారితో సర్జరీలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు లేఖలో పేర్కొన్నారు.  ప్రజల ప్రాణాలతో ఆటలాడే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పాటించాల్సిన భద్రత ప్రమాణాలు ఇవే.. 

  •     ఆస్పత్రి ప్రాంగణంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  •     రోగులు, సిబ్బంది, సందర్శకుల భద్రత కోసం తగిన సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి.
  •     ఎమర్జెన్సీ కోసం ఫైర్ సేఫ్టీ పరికరాలు సిద్ధంగా ఉంచాలి.
  •     ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెలిసేలా స్పష్టంగా సూచించాలి.
  •     బయోమెడికల్ వ్యర్థాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరలించాలి.
  •     ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ వంటి కీలక విభాగాల్లో ప్రత్యేక భద్రతా ప్రమాణాలు పాటించాలి.
  •     విద్యుత్, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించాలి.
  •     సంక్రమణ వ్యాధుల నివారణకు శుభ్రత, శానిటైజేషన్ చర్యలు కచ్చితంగా చేపట్టాలి.
  •     ఆస్పత్రి సిబ్బందికి తరచూ భద్రతా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
  •     లిఫ్ట్‌‌లు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మార్గాలు, సాంకేతిక పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండొద్దు