IIT, NIT విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఒరాకిల్.. క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఇచ్చిన ఆఫర్ లెటర్స్ క్యాన్సిల్

IIT, NIT విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఒరాకిల్.. క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఇచ్చిన ఆఫర్ లెటర్స్ క్యాన్సిల్

టెక్ దిగ్గజం ఒరాకిల్ తీసుకున్న సంచలన నిర్ణయం దేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన కేవలం నెల రోజుల వ్యవధిలోనే.. ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులకు గతంలో ఇచ్చిన జాబ్ ఆఫర్లను ఒరాకిల్ రద్దు చేయడం కలకలం రేపుతోంది. కెరీర్ అద్భుతంగా ఉంటుందని కలలు కన్న విద్యార్థులు ఇప్పుడు దిక్కుతోచని స్థితి ఏర్పడింది.

ఆశలపై నీళ్లు చల్లిన ఒరాకిల్..
సాధారణంగా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్లేస్‌మెంట్ రావడం అంటే జీవితం సెటిల్ అయిపోయినట్లే అని భావిస్తారు. ఒరాకిల్ కంపెనీ ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ పేరుతో విద్యార్థులకు ఇచ్చిన ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లను వెనక్కి తీసుకోవటం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. దీనివల్ల నిన్నటి వరకు ఆనందంలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఒక ఎన్‌ఐటీ విద్యార్థి ఆదిత్య కుమార్ బరావల్ లింక్డ్‌ఇన్‌లో తన ఆవేదనను పంచుకుంటూ.. కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం తనతో పాటు మరికొందరి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్నాడు.

వన్ స్టూడెంట్ - వన్ ఆఫర్ పాలసీతో చిక్కులు..
ఈ సమస్య మరింత తీవ్రం కావడానికి ఐఐటీల్లో ఉండే రూల్స్ ప్రధాన కారణం. చాలా ఐఐటీలలో ఒక విద్యార్థికి ఒకే ఆఫర్ అనే పాలసీ ఉంటుంది. అంటే ఒక విద్యార్థి ఒక కంపెనీలో ఉద్యోగం పొందితే.. అతను క్యాంపస్ ప్లేస్‌మెంట్లలోని ఇతర కంపెనీలకు అప్లై చేసుకోవడానికి వీలుండదు. ఇప్పుడు ఒరాకిల్ తన ఆఫర్లను రద్దు చేయడంతో.. అటు ఉద్యోగం లేక, ఇటు ఇతర కంపెనీల ప్లేస్‌మెంట్‌లు క్లోజ్ కావటంతో విద్యార్థుల కలలు తలకిందులయ్యాయి. ఐఐటీ హైదరాబాద్, కాన్పూర్, ఖరగ్‌పూర్ వంటి నగరాల్లో దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ప్రభావితమయ్యారు.

ప్లేస్‌మెంట్ సీజన్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఒరాకిల్ ఈ నిర్ణయం తీసుకోవడం మరింత దారుణం అంటున్నారు స్టూడెంట్స్. విద్యార్థులు తమ బీటెక్, ఎంటెక్ పూర్తి చేసుకుని ఆనందంగా ఉన్న తరుణంలో కంపెనీ నిర్ణయం వారిని కుంగదీసింది. నెలల తరబడి కష్టపడి సాధించిన ఉద్యోగం చేజారిపోవడమే కాకుండా.. ఇప్పుడు మార్కెట్‌లో తీవ్ర పోటీ మధ్య తక్కువ జీతానికి లేదంటే అసలు ఉద్యోగం లేని పరిస్థితుల్లో కొత్త అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. 

విద్యార్థుల తప్పు లేకపోయినా.. కంపెనీల అంతర్గత మార్పుల వల్ల ప్రతిభావంతులు బలికావడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒరాకిల్ నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలోని అనిశ్చితికి అద్దం పడుతోంది. ఏఐ ఉన్న ఉద్యోగాలను పోగొట్టమే కాకుండా కొత్త జాబ్స్ కూడా మాయం చేస్తోందని కంపెనీ నిర్ణయంపై కొందరు అభిప్రాయపడుతున్నారు.