నీట్ లీకేజీ.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే!

నీట్ లీకేజీ..  కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే!

భారతదేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి.  ఇది కేవలం ప్రశ్నపత్రాల లీకేజీగా మాత్రమే  చూడకూడదు.  ఇది 25 లక్షల విద్యార్థుల జీవితాల డామేజీగా చూడాలి.  వాస్తవానికి గత దశాబ్దాలుగా వివిధ పోటీపరీక్షలు నిర్వహించిన  చరిత్ర  భారతదేశానికి ఉంది.  కానీ  గత  పదేండ్ల ఎన్డీఏ ప్రభుత్వంలో  దాదాపు వివిధ ఎగ్జామ్స్​ 89సార్లు  పరీక్ష పేపర్ల లీక్​ ద్వారా  రద్దయిన సంగతి కూడా మనం గుర్తించాలి. దీనికి దోహదపడిన అంశాలను విస్తృతంగా పరిశీలిస్తేనే భవిష్యత్తులో  ఈ తప్పిదాల నుంచి బయటకురావడానికి అవకాశం ఉంటుంది.  అందులో ప్రధానంగా  ఒకప్పుడు మెడికల్​ ఎగ్జామ్​ అనేది ఏ రాష్ట్రానికి చెందిన పరీక్ష విధానాన్ని ఆ రాష్ట్రం  నిర్ణయించేది. 

 దీంతో ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆ పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకోవడం, అదేవిధంగా ఆ పరీక్షా తేదీలు  అకడమిక్​ ఇయర్​కు సంబంధించిన వ్యవహారాలుగా ఉండేవి.  దీనివల్ల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేది.  కానీ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరీక్షా విధానాన్ని  ఒక కేంద్రీకృత వ్యవస్థగా మార్చివేసింది.  దీంతో  దేశవ్యాప్తంగా ఎగ్జామ్​ను ఒకే సందర్భంలో నిర్వహించడం ద్వారా ఎక్కడ  ఓ చిన్నపాటి డామేజీ జరిగినా, ఎక్కడ లీకేజీ జరిగినా కూడా దాని ప్రభావం దేశవ్యాప్తంగా విద్యార్థులపై
 పడి విద్యార్థుల జీవితాలను ఇబ్బందికి గురిచేస్తోంది.  

వాస్తవంగా ఎక్కడో  రాజస్తాన్​లో పరీక్ష లీక్​ అయితే తెలంగాణ విద్యార్థులకు సంబంధం లేదు.  కానీ, అమాయకంగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఏ విద్యార్థులయితే  సీరియస్​గా కూర్చుని చదివారో,  ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల కోసం భారీగా ఖర్చుపెట్టి కోచింగ్ సెంటర్లకు లేదా ఇతర కేంద్రాల్లో  చేర్చారో వారి కష్టమంతా వృథా అయిపోయింది.  తమిళనాడు  మాజీ సీఎం స్టాలిన్​ తన హయాంలో బలంగా చెప్పిందేమిటంటే.. ఇలాంటి ఎగ్జామ్​ను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక ఈవెంట్​గా తీసుకుని  నిర్వహించడం వల్ల ఆ సీట్లకు సంబంధించిన  వ్యవహారం కూడా ఆ రాష్ట్ర విద్యార్థులకే వచ్చే అవకాశం ఉంటుంది.  తద్వారా లీకేజీకి సంబంధించిన వ్యవహారాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. 

  • అడ్మిషన్ల వ్యవహారంలో కూడా తేడాలు

నీట్​ పరీక్ష కేంద్రీకృతం చేయడం వల్ల ఏమైందంటే.. అడ్మిషన్ల వ్యవహారంలో కూడా తేడాలు వచ్చాయి. ఉదాహరణకు  తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్​ మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఈ ఇంజినీరింగ్,  మెడికల్​కు చెందిన విద్యార్థులు చాలా షార్ప్​గా ఉంటారు.  దానికి సంబంధించిన ప్రిపరేషన్​ను హైస్కూల్​ స్థాయిలోనే  స్టార్ట్​ చేస్తారు.  కానీ  వారికి ఈ  లోకల్​స్థాయిలో  సీటుకు ప్రవేశం లభించకపోతే ఈసాట్​  రాస్తారుగానీ  ఉత్తర  భారతదేశం వెళ్లేందుకు సిద్ధంగా లేరు.  అదే దక్షిణ భారతదేశంలో మెడికల్ కాలేజీల్లోగాని, ఇంజినీరింగ్​ కాలేజీల్లో వసతులు ఎక్కువగా ఉండటం వల్ల ఉత్తర భారతదేశానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా జాయిన్​ అవుతున్నారు.  కానీ,  దక్షిణ భారతదేశానికి చెందిన విద్యార్థులు ఉత్తర భారతదేశానికి ఈసాట్​ రాయడానికి వెళ్లడం లేదు. 

దీంతో ఉత్తర భారతదేశంలో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 15శాతం విద్యార్థుల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. కానీ, ఇక్కడ 15శాతం సీట్లు వాళ్లకు ఇవ్వడం వల్ల ఆ 15శాతం సీట్లను మనం కోల్పోతున్నాం.  మనకు సీట్లు కేటాయించిన ఉత్తర భారతదేశం కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, వసతులు లేకపోవడం వల్ల  మన విద్యార్థులు రెండోసారి,  మూడోసారి ప్రయత్నిస్తున్నారు తప్ప ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లడం లేదు.  దీంతో ఒకరకంగా పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయి. 

  • దక్షిణాది విద్యార్థులకు అన్యాయం

ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రంలో సీట్లు వచ్చినా కూడా అక్కడకు మన విద్యార్థులు వెళ్లలేని పరిస్థితి ఉంది.  ఓవరాల్​గా ఒకప్పుడు ఎంసెట్​లాంటి ఎగ్జామ్​ మనదగ్గర ఉన్నప్పుడు వైభవంగా ఉండేది. కానీ నీట్​ఎగ్జామ్​ వల్ల  ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు మన విద్యార్థులు సుముఖంగా లేకపోవడం వల్ల దక్షిణ భారతదేశ విద్యార్థులు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారు. అలాగే ఈ నీట్​ ఎగ్జామ్​కు విద్యార్థులను తయారుచేసే అవకాశం కొద్దిమంది ప్రొఫెసర్లకు మాత్రమే సాధ్యం అవుతుంది. 

ఈ వ్యవహారం, కీ, కొద్దిమంది అధికారులకు మాత్రమే తెలుస్తుంది. పేపరు లీకేజీ అయిందంటే కచ్చితంగా ఉన్నతాధికారులు లేదా దీనికి సంబంధించిన ఉన్నత నిర్వాహకులకు సంబంధించిన హస్తం లేకుండా జరిగే అవకాశం లేదు. నీట్ పేపరు గతంలో 2015లో లీక్​ అయింది.  అదేవిధంగా  2021, 2024లో ఇప్పుడు 2026లో లీక్​ అయింది. ఇన్నిసార్లు పరీక్ష పేపర్లు లీక్​ అయినా కూడా ఇప్పటివరకు దోషులను శిక్షించినట్లుగాని, లేదా నీట్​ వ్యవహారాన్ని చక్కదిద్దినట్లుగాని  మనకు ఎక్కడా కనిపించడం లేదు. 

అంటే నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఇప్పుడు నేషనల్​ థెఫ్టింగ్​ ఏజెన్సీలాగ మారిపోయింది. ఉన్నతాధికారులు లీకేజీలో ఇన్​వాల్వ్​ కావడం వల్ల  కంచే చేనుమేసినట్టుగా అయింది. చివరికి ఇది రాజకీయ తాబేదార్లుకు కేంద్రంగా తయారైంది. వ్యాపార కేంద్రంగా మారిపోయింది. ప్రస్తుతం అరెస్టు చేసిన ఇద్దరి ప్రముఖుల్లో ఒకరు బీజేపీ నాయకుడు పేరు కూడా మనకు వినిపించింది.  

  • పరీక్షను రాష్ట్రాలకే వదిలేయాలి

ఈ వ్యవహారాలన్నీ మనకు ఏం చెపుతున్నాయంటే  దేశవ్యాప్తంగా  ఒకేసారి పరీక్ష నిర్వహించడం వల్ల ఎక్కడో  ఒకచోట లీక్​ అయినా కూడా దానిప్రభావం దేశవ్యాప్తంగా విద్యార్థులపై పడుతుంది. కాబట్టి గతంలో మాదిరిగా ఏ రాష్ట్రానికి  సంబంధించిన పరీక్ష వ్యవహారాన్ని  ఆ రాష్ట్రమే నిర్వహించాలి.  గతంలో  పేపరు లీకేజీకి పాల్పడ్డవారిని శిక్షించాలి. ఆ విషయం దేశవ్యాప్తంగా ప్రచారంలోకి రావాలి. భవిష్యత్తులో  లీకేజీ చేయాలనుకునేవారికి ఒక హెచ్చరికగా ఉండాలి. మూడోది సీట్ల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల సీట్లను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే కేటాయించుకునే పరిస్థితి కల్పించాలి. 

  • దేశవ్యాప్తంగా విద్యార్థులపై ప్రభావం

కేంద్రీకృత పరీక్షా విధానం అంటే ఒకే దేశం, ఒకే పరీక్ష, ఒకే ప్రవేశం.. ఈ విధానం నీట్​ పరీక్ష పేపరు లీక్​ కావడంతో  మన కళ్లముందే  ఫెయిల్​ అయిపోయింది. అలాగే  పది సంవత్సరాల కాలంలో  వివిధ పరీక్షలు దాదాపు 89సార్లు పరీక్ష పత్రాలు లీక్​ అయిన సందర్భాలను మనం చూశాం. ఈ వైఫల్యాల నుంచి కేంద్ర ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకుని, పరీక్షల నిర్వహణను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునేలా అనుమతించాలని మనం కోరుకోవాలి. భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగితే పరీక్షల పట్ల,  విద్యావ్యవస్థ పట్ల  విద్యార్థులు నమ్మకాన్ని కోల్పోతారు.  ఈ నమ్మకాన్ని కోల్పోయిన విద్యార్థులు నైరాశ్యంలోకి వెళ్లిపోయి తమ భవిష్యత్తును అగమ్యగోచరంగా  మార్చుకుంటారు. 

  • నిందితులును కఠినంగా శిక్షించాలి

 గత విధానంలోగానే  ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్షను నిర్వహించాలని.  లీకేజీలకు పాల్పడినవారిని రాజకీయాలకు అతీతంగా కఠినమైన శిక్షను విధించాలని,  ప్రస్తుతం లీకేజీ వ్యవహారంతో  గుణపాఠం నేర్చుకోవాలని...ప్రజాస్వామ్యవాదుల్లాగ,  విద్యావ్యవస్థను పరిరక్షించేవారిలా,  అలాగే భవిష్యత్తు భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించేవారిలా తక్షణమే నీట్​విధానాన్ని తొలగించాలని కోరుకుందాం.  లేదా పూర్తిగా ప్రక్షాళన జరగాలి. 

  • యూపీఎస్సీ విధానాన్ని అనుసరించాలి

ఉదాహరణకు యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ఉంది. యూపీఎస్సీ అద్భుతంగా పరీక్షలను నిర్వహిస్తోంది.  యూపీఎస్సీని 
మార్గదర్శకంగా తీసుకుని సరైన యంత్రంగాన్ని రూపొందించుకుని,  అకడమిక్​ బ్యాక్​గ్రౌండ్​తీసుకుని టైం టేబుల్​ రూపొందించి పరీక్షలు 
నిర్వహించాలి.  రాష్ట్రాల సంఖ్య కూడా గణనీయంగా ఉంది కాబట్టి పూర్తిగా ఆన్​లైన్​లో నిర్వహించడం కూడా సాధ్యం కాకపోవచ్చు.  ఒకవేళ కేంద్రమే నిర్వహించాలనుకుంటే యూపీఎస్సీ విధానాన్ని అనుసరించాలి. లేకపోతే రాష్ట్రాలకే పరీక్ష నిర్వహణను అప్పగించాలని విద్యా నిపుణుడిగా కేంద్రాన్ని కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యను పరిరక్షించేవారిగా కోరుకుందాం.   

- డా. రియాజ్
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్​

Note:  ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.