పోస్టల్ డిపార్ట్మెంట్ తమ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించింది. గతంలో పోస్టాఫీస్ అంటే కేవలం ఉత్తరాలు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లేదా చిన్న పాటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కి మాత్రమే పరిమితం అనుకునే వారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కస్టమర్ల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీస్ సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. తాజాగా మే 8, 2026 నుంచి అమలులోకి వచ్చిన పర్సనలైజ్డ్ చెక్ బుక్ సదుపాయం, పోస్టాఫీస్ బ్యాంకింగ్ వ్యవస్థను కమర్షియల్ బ్యాంకులకు దీటుగా నిలబెట్టింది.
బ్యాంకులకు దీటుగా చెక్ బుక్ ఫెసిలిటీ..
ఇప్పటివరకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఇచ్చే చెక్ బుక్కుల మీద ఖాతాదారుల పేర్లు ఉండేవి కావు. కానీ ఇకపై అలా కాదు. కొత్తగా ప్రవేశపెట్టిన సిస్టమ్‌లో అకౌంట్ హోల్డర్లు తీసుకునే చెక్ బుక్ మీద వారి పేరు, అకౌంట్ నంబర్, IFSC కోడ్ వంటి వివరాలు ముందే ప్రింట్ అయి వస్తాయి. దీనివల్ల ట్రాన్సాక్షన్స్ మరింత ఈజీ కావడమే కాకుండా.. సెక్యూరిటీ పరంగా కూడా ఇవి మరింత బలోపేతం కానున్నాయి. ఆధునిక బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ క్రేజీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.
మీ ఇంటికే ఉచితంగా డెలివరీ..
ఈ పర్సనలైజ్డ్ చెక్ బుక్ కోసం కస్టమర్లు తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ చెక్ బుక్ కస్టమర్లకు పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి. దరఖాస్తు చేసిన తర్వాత.. రికార్డుల్లో ఉన్న కస్టమర్ అడ్రస్‌కే నేరుగా పోస్ట్ ద్వారా ఈ చెక్ బుక్ డెలివరీ అవుతుంది. కాబట్టి మీ అడ్రస్ అప్‌డేటెడ్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్. త్వరలోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా దీన్ని ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు.
ఇన్‌స్టంట్ కావాలా? పర్సనలైజ్డ్ కావాలా?
కొత్త ఫెసిలిటీ వచ్చినా.. పాత సిస్టమ్ అలాగే కొనసాగనుంది. మీకు అత్యవసరంగా కావాలంటే కౌంటర్ దగ్గరే వెంటనే ఇచ్చే 'ఇన్‌స్టంట్ చెక్ బుక్' సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ప్రొఫెషనల్‌గా, స్టైలిష్‌గా మీ పేరుతో ఉండే చెక్ బుక్ కావాలనుకుంటే మాత్రం పర్సనలైజ్డ్ ఆప్షన్ బెస్ట్ అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టల్ సర్కిల్స్ ఈ కొత్త విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పోస్టాఫీస్ కస్టమర్లు కూడా చెక్ బుక్ మీద తమ పేరుంటుందని గర్వంగా చెప్పుకోవచ్చు.
