సనత్ నగర్ టిమ్స్లో 1,400 పోస్టుల భర్తీ

సనత్ నగర్ టిమ్స్లో 1,400 పోస్టుల భర్తీ
  • రీడిప్లాయ్మెంట్ పద్ధతిలో సిబ్బంది నియామకానికి ఆర్థిక శాఖ ఉత్తర్వులు 
  • మెడికల్ కాలేజీల్లోని అదనపు సిబ్బందిని టిమ్స్​కు మార్చాలని సూచన

హైదరాబాద్, వెలుగు:  సనత్ నగర్ తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం1,400కుపైగా పోస్టుల భర్తీకి రీడిప్లాయ్మెంట్ పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తూ గురువారం జీవో విడుదల చేసింది. వచ్చే నెలలో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం ఫైనాన్స్ క్లియరెన్స్ రావడంతో ఇప్పుడు జిల్లా స్థాయిలోని అదనపు సిబ్బందిని ఇక్కడికి మార్చే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ నెలాఖరుకల్లా సిబ్బంది కేటాయింపులు పూర్తి చేసి, జూన్ లో సీఎం చేతుల మీదుగా హాస్పిటల్ ను ప్రారంభించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అదనంగా ఉన్న సిబ్బందిని సనత్ నగర్ టిమ్స్ కు బదిలీ చేయాలని ఆర్థిక శాఖ సూచించింది.

ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, ఇతర సిబ్బంది ఉన్నారు. కొత్తగా రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేసి ప్రక్రియను ఆలస్యం చేయడం కంటే, ఇప్పటికే అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన సిబ్బందిని ఇక్కడ వినియోగించుకోవడమే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. దీనివల్ల వెంటనే హాస్పిటల్ సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి అవకాశం ఏర్పడనుంది. 

మిగతా టిమ్స్ ప్రపోజల్స్ వెనక్కి 

సిటీలో సనత్ నగర్, అల్వాల్, కొత్తపేట వద్ద నిర్మిస్తున్న మూడు టిమ్స్ హాస్పిటల్స్ కోసం వైద్యారోగ్య శాఖ మొత్తం 4,588 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపింది. అయితే, అల్వాల్, కొత్తపేట టిమ్స్ పనులు ఇంకా కొనసాగుతుండటంతో వాటికి సంబంధించి 3 వేలకు పైగా పోస్టులకు దశలవారీగా ప్రతిపాదనలు పంపాలని ప్రస్తుత ప్రపోజల్స్ ను ఆర్థిక శాఖ వెనక్కి పంపింది.

ప్రస్తుతం సనత్ నగర్ టిమ్స్ నిర్మాణం పూర్తికావడంతో.. ప్రాధాన్యత క్రమంలో మొదటగా ఇక్కడి పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెయ్యి బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక మెడికల్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో సిద్ధమైన ఈ హాస్పిటల్ లో ప్రస్తుతం ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తోంది.