భారతీయులకు బంగారం అంటే జస్ట్ సెంటిమెంట్ మాత్రమే కాదు అదొక ఆర్థిక భరోసా. ఇప్పుడు అదే భారతీయుల పాలిట అగ్నిపరీక్షగా మారింది. విదేశీ మారక నిల్వలు కరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై పన్నుపోటు వేసింది. అయితే ఈ పన్నుల పెంపుతో వచ్చే ప్రయోజనం కేవలం నెల రోజులకే సరిపోతుందన్న వార్త ఇప్పుడు ఇన్వెస్టర్లను, సామాన్యులను కలవరపెడుతోంది.
పసిడిపై పన్ను పోటు..
బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఒకేసారి 9% దిగుమతి సుంకాన్ని పెంచింది. అంటే ఒకప్పుడు 6% పన్ను కాస్తా.. ఇప్పుడు 15%కి చేరింది. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా.. మరో 5% అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌గా ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఈ నిర్ణయం వచ్చిన వెంటనే మే 14 నాటికి తులం బంగారం ధర దాదాపు రూ. లక్షా 62వేల వద్ద స్థిరపడటం చూస్తుంటే పసిడి ఇక సామాన్యుడికి కలగానే మిగిలిపోయేలా ఉంది.
నెల రోజులకే సరిపోతుందా? షాకింగ్ లెక్కలు
ప్రభుత్వం పన్నులు పెంచడం ద్వారా డిమాండ్ తగ్గుతుందని ఆశిస్తోంది. కానీ నిపుణులు మరో కోణాన్ని ఫోకస్ చేస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం.. ప్రతి 1% పన్ను పెరిగితే బంగారం డిమాండ్ కేవలం 6.4 టన్నులు మాత్రమే తగ్గుతుందట. అంటే ఇప్పుడు పెంచిన 9% పన్ను వల్ల ఏడాది మొత్తం మీద కేవలం 57 టన్నుల డిమాండ్ మాత్రమే తగ్గే అవకాశం ఉంది. మనం నెలవారీ సగటున 83 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ పన్నుల పెంపు ద్వారా ఆదా అయ్యేది కేవలం ఒక్క నెల దిగుమతులకు మాత్రమే సరిపోతుంది. మరి మిగిలిన 11 నెలల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఫారెక్స్ రిజర్వ్స్ పై ఒత్తిడి..
భారత్ తన డాలర్లను ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, బంగారం దిగుమతుల కోసం ఖర్చు చేస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, మరో పక్కన బంగారం దిగుమతులు తగ్గకపోవడంతో భారత్ ఫారెక్స్ నిల్వలు కేవలం వారం రోజుల్లోనే 7.7 బిలియన్ డాలర్లు తగ్గి 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 96 మార్కుకు చేరువలో ఉండటం ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికగా మారింది. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికే ప్రభుత్వం పసిడిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
స్మగ్లింగ్ పెరుగుతుందా?
చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. 2013లో కూడా ఇలాగే పన్నులు పెంచినప్పుడు అధికారికంగా దిగుమతులు తగ్గినా, అనధికారికంగా బంగారం స్మగ్లింగ్ పెరిగిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పన్ను భారం పెరిగితే గ్రే మార్కెట్ ఊపందుకునే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ కూడా భారతీయులను ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు.
►ALSO READ | బియ్యం కొరత రాబోతుందా.. అన్నం రిచ్ ఫుడ్ కాబోతుందా.. వరి ఉత్పత్తి 15% తగ్గనున్నట్లు అమెరికా నివేదిక..!
