ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల కంచంలో ఆహారమైన బియ్యం ధరలకు రెక్కలు రాబోతున్నాయా? రానున్న రోజుల్లో అన్నం తినడం కేవలం ధనవంతులకేనా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా విడుదల చేసిన తాజా రిపోర్ట్స్. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి భారీగా తగ్గనుండటమే దీనికి ప్రధాన కారణం. అమెరికా వ్యవసాయ శాఖ లేటెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.
11 ఏళ్లలో లేని భారీ పతనం..
వరుసగా పదేళ్ల పాటు రికార్డు స్థాయి దిగుబడిని సాధించిన బియ్యం ఉత్పత్తికి ఇప్పుడు బ్రేక్ పడనుంది. 2026-27 సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా బియ్యం దిగుబడి 538 మిలియన్ టన్నులకు పడిపోవచ్చని అంచనా. గత 11 ఏళ్లలో ఉత్పత్తి తగ్గడం ఇదే మొదటిసారి. ప్రధానంగా ప్రపంచానికి అన్నపూర్ణగా ఉన్న భారత్, మయన్మార్, అమెరికా వంటి దేశాల్లో ఉత్పత్తి ఏకంగా 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది. ఒకవైపు వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతుంటే.. మరోవైపు నిల్వలు తగ్గిపోతుండటం బియ్యం సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది.
రైతును వేధిస్తున్న ఇరాన్ యుద్ధం - ఎరువుల కొరత
ఉత్పత్తి తగ్గడానికి ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణమైతే, మానవ తప్పిదాలు మరో కారణంగా మారాయి. ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. బియ్యం సాగుకు ఎరువులు చాలా కీలకం. అయితే వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. లాభం లేక చాలా మంది రైతులు ఈసారి సాగుకు దూరంగా ఉండాలని క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. మరికొందరు సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది నేరుగా దిగుబడిపై ప్రభావం చూపుతోంది. పెట్టుబడి పెరగడం వల్ల మార్కెట్‌లో బియ్యం రేట్లు సామాన్యుడికి అందనంతకు వెళ్లే ప్రమాదం ఉంది.
►ALSO READ | బిగ్ అలర్ట్.. జూన్ 25 నుంచి తెలంగాణలో.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(SIR)
భారత్‌పై ఎల్ నినో పంజా..
ప్రపంచంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న భారత్‌కు ఈసారి వాతావరణ గండం పొంచి ఉంది. జూన్ నుంచి ప్రారంభం కావాల్సిన నైరుతి రుతుపవనాలు 'ఎల్ నినో' ప్రభావంతో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే వరి సాగు దెబ్బతింటుంది. ఒకవైపు దిగుబడి తగ్గడం, మరోవైపు ఎగుమతులపై ఆంక్షలు వంటి పరిణామాలు జరిగితే దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు చుక్కలు చూడటం ఖాయం. అమెరికా నుంచి బియ్యం సరఫరా కూడా తగ్గుతుండటంతో గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి, అది రేట్ల పెరుగుదలకు దారితీయనుంది. మొత్తానికి తగ్గుతున్న దిగుబడి మరియు పెరుగుతున్న ఖర్చులు మున్ముందు బియ్యం ధరలను పెంచి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉంది. ప్రభుత్వాలు ఇప్పుడే మేల్కొని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే 'బియ్యం సంక్షోభం' తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
