- కారు ముందు బైఠాయించి నినాదాలు
- ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
పంజాగుట్ట, వెలుగు: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన రాగా.. అక్కడే ఉన్న నిరుద్యోగ సంఘాల నాయకులు ఆయనను చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో కోదండరామ్ ప్రెస్‌క్లబ్‌లోకి వెళ్లారు.
ఆయన కారు పార్కింగ్‌లో ఉండటాన్ని గమనించిన నిరుద్యోగులు కారు ముందు బైఠాయించి కోదండరామ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోదండరామ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కారును కదలనీయకుండా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట, ఖైరతాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ముగించుకుని బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కోదండరామ్‌ను నిరుద్యోగ సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి సత్వరమే తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
