యూనిటీ మాల్‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్లలో కుంభకోణం.. రాయదుర్గంలో ప్రతిపాదిత స్థలం పరిశీలన

యూనిటీ మాల్‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్లలో కుంభకోణం.. రాయదుర్గంలో ప్రతిపాదిత స్థలం పరిశీలన
  •     బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌‌‌‌

గచ్చిబౌలి, వెలుగు: రాయదుర్గంలోని పీఎం ఏక్తా యూనిటీ మాల్‌‌‌‌ టెండర్లలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ డాక్టర్‌‌‌‌ దాసోజు శ్రవణ్‌‌‌‌ ఆరోపించారు. బుధవారం ఎమ్మెల్సీ శంభీపూర్‌‌‌‌ రాజు, ఇతర నాయకులతో కలిసి రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా ఉన్న యూనిటీ మాల్‌‌‌‌ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. 

పోలీసులు వారిని అడ్డుకోవడంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలు గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం దాసోజు శ్రవణ్‌‌‌‌ మాట్లాడుతూ.. రాయదుర్గంలోని 6.3 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి మార్కెట్‌‌‌‌ విలువ సుమారు రూ.1,700 కోట్లు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.200 కోట్లతో కలిపి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2 వేల కోట్లుగా ఉందన్నారు. ఇంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌‌‌‌ సంస్థలకు లబ్ధి చేకూరేలా కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

భవిష్యత్తులో ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ పెరిగితే వచ్చే అదనపు నిర్మాణ హక్కులు కూడా ప్రైవేట్‌‌‌‌ సంస్థలకే చెందేలా నిబంధనలు రూపొందించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. టెండర్‌‌‌‌ అర్హతల నిబంధనలను కొన్ని సంస్థలకు అనుకూలంగా మార్చి పోటీని పరిమితం చేశారని శ్రవణ్‌‌‌‌ ఆరోపించారు. టెండర్లను వెంటనే రద్దు చేసి సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్‌‌‌‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

పీఎం ఏక్తా మాల్‌‌‌‌ ప్రాజెక్టులో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్నా రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, నవతారెడ్డి, నాయకులు మిద్దెల మల్లారెడ్డి, రవి యాదవ్‌‌‌‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.