న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్‌ఐ)పై వేటు పడింది. పనితీరు లోపాలు, పాలనాపరమైన ఇబ్బందుల కారణంగా టీటీఎఫ్‌ఐ గుర్తింపును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం రద్దు చేసింది. టేబుల్ టెన్నిస్ క్రీడా నిర్వహణ కోసం అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)కు సూచించింది.
సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో టీటీఎఫ్ఐ విఫలమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) సంప్రదింపులతో ఐవోఏ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. టీటీఎఫ్‌ఐలో చోటు చేసుకున్న అంతర్గత కలహాల వల్లే సమాఖ్య రద్దు వరకు వెళ్లిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
హర్యానా ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా భార్య మేఘనా అహ్లావత్ డిసెంబర్ 2022లో టీటీఎఫ్ఐ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతి నుంచి ఫెడరేషన్‌లో వర్గపోరు మొదలైంది. ఆర్థికపరమైన అవకతవకల ఆరోపణలతో జనవరిలో జనరల్ సెక్రటరీ కమలేష్ మెహతాను సస్పెండ్ చేశారు. దీనిపై మెహతా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్ రద్దయింది.
స్టార్ ప్యాడ్లర్ మానికా బత్రాను ఆసియా క్రీడల జట్టు నుంచి తప్పించడం కూడా అప్పట్లో పెద్ద వివాదమైంది. జాతీయ చాంపియన్‌షిప్ నిర్వహణలో జాప్యం జరగడం, అథ్లెట్ల సంక్షేమాన్ని విస్మరించడం వంటి కారణాలను మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది.
