స్పీకర్ అధికారానికీ పరిమితులుంటయ్..పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టులో పిటిషనర్ల తరుఫు లాయర్ల వాదన

స్పీకర్ అధికారానికీ పరిమితులుంటయ్..పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టులో పిటిషనర్ల తరుఫు లాయర్ల వాదన

హైదరాబాద్‌‌‌‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌‌‌‌ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. స్పీకర్ అధికారానికి పరిమితులున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.  ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే మరో పార్టీ తరఫున పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్​రెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌‌‌‌రెడ్డి, టి. ప్రకాశ్‌‌‌‌గౌడ్, ఎ. గాంధీ, తెల్లం వెంకటరావు, సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్‌‌‌‌ ఇచ్చిన తీర్పులను సవాల్‌‌‌‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీ జగదీశ్‌‌‌‌రెడ్డి, కేపీ వివేకానంద, కే సంజయ్, పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డి, సీహెచ్‌‌‌‌ ప్రభాకర్, పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత మహేశ్వర్‌‌‌‌రెడ్డి దాఖలు చేసిన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జి.ఎం. మొహియుద్దీన్‌‌‌‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌ న్యాయవాదులు కే వివేక్‌‌‌‌రెడ్డి, గండ్ర మోహన్‌‌‌‌రావు వాదనలు వినిపిస్తూ.. పిటిషన్లను కొట్టివేయడానికి స్పీకర్‌‌‌‌ పరిగణనలోకి తీసుకున్న ఆధారాలను పిటిషనర్లకు అందజేయలేదని చెప్పారు. 

ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి అనంతరం మరో పార్టీ తరఫున లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీ తరఫున పోటీ చేయడాన్ని రాజ్యాంగం నేరుగా నిషేధించకపోయినా, పార్టీ మారితే పదో షెడ్యూల్‌‌‌‌ కింద అనర్హత వర్తించే అవకాశం ఉందన్నారు. అనర్హతకు కేవలం వార్తా కథనాలనే ఆధారంగా తీసుకోలేదని, ఎన్నికల గెజిట్లు, అధికారిక పత్రాలు, నామినేషన్‌‌‌‌ సందర్భంగా సమర్పించిన ఫారం-26 అఫిడవిట్లను ఆధారాలుగా సమర్పించామని తెలిపారు. అయినప్పటికీ వార్తా కథనాల మూలాలు, రిపోర్టర్లు, ఎడిటర్ల వివరాలు ఇవ్వలేదని స్పీకర్‌‌‌‌ తీర్పులో పేర్కొనడం సరికాదన్నారు.