స్కూల్ను ‘మూడు గంటలు’ తనిఖీ చేయాల్సిందే

స్కూల్ను ‘మూడు గంటలు’ తనిఖీ చేయాల్సిందే
  •     బడుల పర్యవేక్షణపై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కొత్త గైడ్‌‌‌‌లైన్స్ 
  •     ఎంఈఓలు నెలకు 20 స్కూళ్లు, డీఈఓలు, ఆర్జేడీలు 12, హెచ్​ఓడీలు 5 స్కూళ్లు విజిట్ చేయాలి
  •     45 నిమిషాల పాటు క్లాస్ రూమ్ లోనే ఉండి బోధన పరిశీలించాల్సిందేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇకపై సర్కారు స్కూళ్ల తనిఖీకి వెళ్లే ఆఫీసర్లు మూడు గంటల పాటు విధిగా అక్కడే ఉండి అన్ని విషయాలను పరిశీలించాలని, అప్పుడే ఆ విజిట్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. సర్కారు బడుల్లో విద్యార్థుల కనీస సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్​ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్ (లిప్) అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్  నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. 

ఎంఈఓలకు నెలకు 20 బడుల టార్గెట్

బడి బాగు కోసం అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరగాలి, ఎన్ని స్కూళ్లను చూడాలి? అనే దానిపై పక్కా టార్గెట్లు విధించారు. ఎంఈఓలు, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్లు వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ నెలకు కనీసం 20 నుంచి 24 స్కూళ్లను సందర్శించాలి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు నెలకు 16 నుంచి 20 బడులను, డీఈఓలతోపాటు ఆర్జేడీలు నెలకు 12 నుంచి 16 స్కూళ్లను విధిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి హెచ్‌‌‌‌ఓడీలు, డైరెక్టర్లు కూడా నెలకు కనీసం 5 స్కూళ్లను సందర్శించాల్సి ఉంటుంది.

క్లాస్ రూమ్ లో 45 నిమిషాలు ఉండాలి

అధికారి స్కూల్లో గడిపే మూడు గంటల టైమ్​లో కనీసం 45 నిమిషాల పాటు క్లాస్​ రూములోనే కూర్చోవాలి. టీచర్లు ఎలా చెప్తున్నారు, విద్యార్థులు ఎంతవరకు నేర్చుకుంటున్నారు? అనేది నిశితంగా గమనించాలి. అక్కడికక్కడే టీచర్లకు సూచనలు ఇవ్వాలి. అనంతరం స్కూల్ సిబ్బందితో మీటింగ్ నిర్వహించి లోపాలను ఎలా సరిదిద్దాలో మార్గనిర్దేశం చేయాలి. విజిట్ డేటాను ఎడ్యుకేషన్ యాప్ లో అప్‌‌‌‌లోడ్ చేయాలి. 

ప్రతినెలా రివ్యూ

పర్యవేక్షణపై రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ప్రతి నెల 28న జిల్లా స్థాయిలో డీఈఓలు, 29న రాష్ట్ర స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సమీక్ష చేస్తారు. ఎఫ్ఎల్ఎన్ లో వెనుకబడిన స్కూళ్లపై దృష్టి పెట్టాలని, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు.