హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న మంజీరా బ్యారేజీ దిగువ భాగంలో దెబ్బతిన్న ఫ్లెక్సిబుల్ అప్రాన్ రిపేర్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.20 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి(ఎంయూడీ) శాఖ బుధవారం జీవో 780ను జారీ చేసింది. రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్‌డీఎస్‌వో) నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి, దిగువన దెబ్బతిన్న ప్రాంతాలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని సిఫారసు చేసింది.
1965లో నిర్మించిన ఈ బ్యారేజీ 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2025లో వచ్చిన భారీ వరదలకు ఫ్లెక్సిబుల్ అప్రాన్‌లోని కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడంతో నిర్మాణం దెబ్బతిన్నది. మరమ్మతులు చేయకపోతే బ్యారేజీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్న ఎస్‌డీఎస్‌వో హెచ్చరికల నేపథ్యంలో.. వాటర్ బోర్డు ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఎనర్జీ డిసిపేటర్ వద్ద మరమ్మతు పనులు త్వరలో చేపట్టనున్నారు.
