విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయండి

విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయండి
  •     జెన్‌‌‌‌కోతో పాటు సంబంధిత విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ట్రాన్స్‌‌‌‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఆరు నెలల్లోగా సమీక్షించాలని ఆయా సంస్థలను హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వంతో సంప్రదించి, పూర్తి చేసేందుకు తగిన గడువు నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీజీ జెన్‌‌‌‌కోతో పాటు సంబంధిత విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినమైన 2014, జూన్‌‌‌‌ 2 నుంచి ఇప్పటివరకు కల్పించిన అన్ని పదోన్నతులను సమీక్షించాలంటూ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి మరికొందరితో కలిసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు జస్టిస్ నగేశ్ భీమపాక బుధవారం మరోసారి విచారణ జరిపారు.ఉన్నత కేడర్లలో పదోన్నతులు కల్పించేటప్పుడు కేవలం ఇష్టానుసారంగా కాకుండా.. సుప్రీంకోర్టు వెలువరించిన ప్రముఖ తీర్పులైన ఎం. నాగరాజ్, జర్నైల్ సింగ్, బీకే పవిత్ర, పన్నీర్‌‌‌‌సెల్వం కేసుల్లోని న్యాయ సూత్రాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే ఆయా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించి, నిబంధనల ప్రకారమే పదోన్నతులు కల్పించాలని పేర్కొంది. మొత్తంగా ఆరు నెలల్లోగా పదోన్నతుల సమీక్షను పూర్తి చేయాలని పునరుద్ఘాటిస్తూ విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు