మేడిపల్లి, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ప్రకటన చూసి ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ.6.73 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్‌కు చెందిన కొక్కొండ కృష్ణలతకు గత మే 15న ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యాకింగ్ ఉద్యోగ ప్రకటన కనిపించింది. అందులోని నంబర్‌కు ఫోన్ చేయగా.. సిరియా, అంకుశం రాజా, నేహా పరిచయమై స్క్రబ్బర్ ప్యాకింగ్ పని ఇస్తామని నమ్మబలికారు.
తొలుత ముడిసరుకు పంపడంతోపాటు జూన్‌లో రూ.36 వేల జీతం చెల్లించి నమ్మకం పెంచారు. ఆ తర్వాత డ్రైఫ్రూట్స్, మసాలా ప్యాకింగ్ ప్రాజెక్ట్ పేరుతో యంత్రాలు, ముడిసరుకు ఇస్తామని చెప్పి విడతల వారీగా మొత్తం రూ.7.09 లక్షలు వసూలు చేశారు.
ఆ తర్వాత ఎలాంటి సరుకు, జీతం ఇవ్వకుండా ముఖం చాటేశారు. మాషా అల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఈ మోసం జరిగిందని బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
