రైతుల కోసం నయా విలేజ్...కాకతీయ మెగా టెక్స్ టైల్‍ పార్క్ కు భూములిచ్చిన వారికి సర్కార్ గిఫ్ట్

రైతుల కోసం నయా విలేజ్...కాకతీయ మెగా టెక్స్ టైల్‍ పార్క్ కు భూములిచ్చిన వారికి సర్కార్ గిఫ్ట్
  •     రాజీవ్‍గాంధీ టౌన్​షిప్‍ పేరుతో మోడల్‍ విలేజ్‍ నిర్మాణం
  •     కొత్త జీపీగా త్వరలోనే అధికారిక ప్రకటన
  •     భూములిచ్చిన 866 మంది రైతులకు ఇందిరమ్మ ఇండ్లు
  •     రూ.90 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్​ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఊరును సృష్టిస్తోంది. గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని రైతులు 1,327 ఎకరాల భూములను కేటాయించిన నేపథ్యంలో సీఎం రేవంత్‍రెడ్డి వారి కోసం నయా విలేజ్​ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రైతుల మేలు కోసం ఉచితంగా ఇంటిజాగలు ఇవ్వడం మొదలు ఇంటి నిర్మాణం సైతం ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్నారు. 

ఇందుకోసం దాదాపు రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రెండేళ్ల కింద మొదలైన మోడల్‍ విలేజ్‍కు రాజీవ్‍ గాంధీ టౌన్‍షిప్‍ అని పేరు పెట్టారు. ఇప్పటికే రోడ్లు, అండర్‍ డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, వాటర్‍ ఫెసిలిటీ పంపుల పనులు చేపట్టారు. ఈనెల 10న పీఎం మోదీ 'పీఎం మిత్ర' పథకంలో పార్కును ప్రారంభించారు. రాజీవ్‍గాంధీ టౌన్‍షిప్‍లో 866 ఇండ్లు నిర్మించి గ్రామ పంచాయతీగా ప్రకటించేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. 

సీఎం రేవంత్‍రెడ్డి ఆదేశాలతో.. 

కాకతీయ మెగా టెక్స్​టైల్​పార్క్ ఏర్పాటుకు 2016లో అప్పటి ప్రభుత్వం గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట హవేలి, చింతలపల్లి ఏరియాల్లో 1,327 ఎకరాల భూమి సేకరించింది. కోట్లు విలువ చేసే భూములను రూ.10 లక్షలకు ఎకరం చొప్పున బలవంతంగా గుంజుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధిత రైతులకు రెండేళ్లలో ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికితోడు పార్క్ దగ్గరే డబుల్‍ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని మాటిచ్చారు. 

2017లో పార్క్​ పనులకు శంకుస్థాపన జరగగా, 2023లో కేసీఆర్‍ గవర్నమెంట్‍ దిగిపోయే వరకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈ క్రమంలో 2024లో సీఎం రేవంత్​రెడ్డి టెక్స్​టైల్‍ పార్క్​ను సందర్శించారు. మొదలు రైతులకు ప్రత్యేక అనుమతులతో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఆ ప్రాంతాన్ని రాజీవ్‍గాంధీ టౌన్‍ షిప్‍ పేరుతో అభివృద్ధి చేయాలని ఆదేశాలిచ్చారు. 

54.11 ఎకరాల టౌన్‍షిప్‍లో  866 ఇందిరమ్మ ఇండ్లు

కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్​ కోసం రూ.1695. 54 కోట్ల అంచనాతో నిధులు ఖర్చు చేయనున్నారు. 1,327 ఎకరాల్లో నిర్మిస్తున్న పార్క్​లో దాదాపు 24,400 ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. పార్క్​ కోసం భూములిచ్చిన రైతులకు కొత్త ఊరు నిర్మించేలా సంగెం మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో ఊకల్‍_చింతలపల్లి స్టేషన్‍ మధ్య 2017లో పార్క్​ పనులకు శంకుస్థాపన చేసిన పైలాన్‍ దగ్గర 54.11 ఎకరాలు కేటాయించారు. 866 మందికి స్పెషల్‍ ప్యాకేజీలో ఒక్కో లబ్ధిదారులకు 75 గజాల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ 2024 నవంబర్‍లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

5 వేల జనాభాతో కొత్త జీపీ.. 

కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్​కు అనుబంధంగా ఉండే రాజీవ్‍ గాంధీ టౌన్‍షిప్‍ నయా విలేజ్‍ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు దాదాపు రూ.90 కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 866 మందికి రూ.43 కోట్ల 33 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇవిగాక మొదటి దశలో మరో రూ.45 కోట్లతో మోడల్‍ టౌన్‍షిప్‍లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రూ.9 కోట్ల 20 లక్షలతో వాటర్‍ లైన్లు, అండర్‍ డ్రైనేజీ సంపులు, తాగునీటి శుద్ధి ప్లాంట్‍, రూ.10 కోట్ల 10 లక్షలతో ఎంఎస్‍ఎంఈ క్లస్టర్‍, రూ.2 కోట్ల 77 లక్షలతో ప్రైమరీ స్కూల్‍, రూ.కోటీ 60 లక్షలతో పీహెచ్‍సీ, రూ.7 కోట్ల 60 లక్షలతో బీటీ రోడ్లు, కల్వర్టులు, రూ.కోటీ 82 లక్షలతో విద్యుత్‍ సరఫరా కనెక్షన్లు, రూ.63 లక్షలతో జీపీ బిల్డింగ్‍, రూ.50 లక్షలతో వెటర్నటీ హాస్పిటల్‍ వంటి ప్రతి ఒక్క వసతి కల్పనకు చర్యలు తీసుకుంది. 

కొత్త జీపీలో ఒక్క టౌన్‍షిప్‍లోనే 866 ఇందిరమ్మ ఇండ్లతో 3 వేల నుంచి 3500 మంది జనాభా ఉండే అవకాశం ఉండగా, స్థానికంగా ప్రైవేట్ భూముల్లో ఏర్పాటయ్యే కాలనీ జనాలతో మొత్తంగా 5 వేల మంది కొత్త గ్రామం పరిధిలో ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆఫీసర్లు కొత్త జీపీ ప్రకటనకు కావాల్సిన పనుల్లో నిమగ్నమయ్యారు.