‘పరాశక్తి’ రెమ్యునరేషన్లో.. రూ.8 కోట్లు ఎగ్గొట్టారని.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర !

‘పరాశక్తి’ రెమ్యునరేషన్లో.. రూ.8 కోట్లు ఎగ్గొట్టారని.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర !

చెన్నై: ‘పరాశక్తి’ సినిమా పారితోషికం విషయంలో దర్శకురాలు సుధా కొంగర మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తనకు చెల్లించాల్సిన మొత్తం రూ.17.60 కోట్లలో రూ. 9.31 కోట్ల పారితోషికం మాత్రమే చెల్లించారని.. రూ. 8.39 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని ఆమె తరపు కౌన్సిల్ కోర్టుకు వివరించింది. 

‘పరాశక్తి’ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రకటించిన నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపించి మిగిలిన బకాయిలను చెల్లించడం లేదని సుధా కొంగర తరపు కౌన్సిల్ కోర్టులో వాదించింది. సుధా కొంగరకు చెల్లించాల్సిన మొత్తం పారితోషికం చెల్లించకుండానే ఇదే నిర్మాణ సంస్థ ‘‘ఇదయం మురళి’’ అనే మరో సినిమాను నిర్మించి విడుదల చేయాలని చూస్తుందని కౌన్సిల్ వివరించింది.

ఈ క్రమంలో.. సుధా కొంగరకు పూర్తి పారితోషికం చెల్లించేంత వరకూ ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ఆమె తరపు కౌన్సిల్ మద్రాసు హైకోర్టును కోరింది. జులై 10న ‘‘ఇదయం మురళి’’ అనే సినిమా విడుదల కావాల్సి ఉంది. డాన్ పిక్చర్స్ (Dawn Pictures) నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ‘‘ఇధయం మురళి’’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ సుధ కొంగర దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సదరు నిర్మాణ సంస్థను ఆదేశించింది. అంతేకాదు.. ఈ కేసు తదుపరి విచారణ జరిగే వరకూ ‘‘పరాశక్తి’’ సినిమాను శాటిలైట్లో కూడా విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ కుమారేశ్ బాబు ఈ ఆదేశాలు జారీ చేశారు.

సుధా కొంగర తరపున హాజరైన న్యాయవాది కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘పరాశక్తి’’ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను ఆమెకు రూ.15 కోట్ల పారితోషికం చెల్లించాల్సి ఉంది. జీఎస్టీ విడిగా చెల్లించాల్సి ఉండటంతో ఈ మొత్తం రూ.17.70 కోట్లు అయింది. ఇందులో.. రూ.9.31 కోట్లు మాత్రమే చెల్లించారని.. రూ.8.39 కోట్లు బకాయి పడ్డారని కోర్టుకు సుధా కొంగర తరపు న్యాయవాది వివరించారు.

ALSO READ : 'ఫాదర్-సన్' సెంటిమెంట్‌తో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్

సుధా కొంగర దర్శకత్వంలో డాన్ పిక్చర్స్ నిర్మించిన ‘పరాశక్తి’ సినిమా ఒక తమిళ్ పొలిటికల్ డ్రామా. శివకార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్, అథర్వ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా 2026 జనవరిలో విడుదలైంది. విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసిందని ప్రచారం జరిగింది. తెలుగమ్మాయి అయిన సుధా కొంగర ‘గురు’, ‘ఆకాశమే హద్దు’ సినిమాలతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే.. ఆమె దర్శకత్వం వహించిన ‘‘పరాశక్తి’’ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది.