భిల్వారా: రాజస్థాన్‌లోని భిల్వారాలో ఒక దొంగ చేసిన చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్ ధరించి సదరు దొంగ ఈ చోరీకి పాల్పడటమే ఇందుకు కారణం. మొబైల్ దుకాణంలోకి దొంగలు పైకప్పు మీదుగా ప్రవేశించి, రూ. 4-5 లక్షల విలువైన 35-40 స్మార్ట్‌ఫోన్‌లను దొంగిలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పోలిన ముసుగు ధరించిన ఒక అనుమానితుడిని ఫుటేజీ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
राजस्थान के भीलवाड़ा में चोर, नरेंद्र मोदी का मुखौटा लगाकर आए और दुकान से 40 मोबाइल चुराकर ले गए !! pic.twitter.com/jZWfdEjWcW
— Sachin Gupta (@Sachingupta) June 30, 2026
కరేడా పట్టణంలోని బస్ స్టాండ్ దగ్గర ఉన్న మాతేశ్వరి మొబైల్ షాపులో సోమవారం రాత్రి ఈ దొంగతనం జరిగింది. మొబైల్ షాపు యజమాని లక్ష్మణ్ సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు మెట్ల గేటు తాళాన్ని పగలగొట్టి, పైకప్పు మీదుగా దుకాణంలోకి చొరబడి, సుమారు రూ. 4-5 లక్షల విలువైన 35 నుండి 40 స్మార్ట్‌ఫోన్‌లను దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం రోజూలానే సేన్ షాప్ తెరిచి చూడగా.. షాప్ లోపల మొత్తం చిందరవందరగా ఉంది. ఖరీదైన మొబైల్ ఫోన్ పెట్టెలు ఖాళీగా పడి కనిపించాయి.
మొబైల్ యాక్సెసరీలు నేలంతా చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగిందని షాపు ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. షాప్ ఓనర్ ఫిర్యాదుతో కరేడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మొబైల్ షాపును పరిశీలించారు.
►ALSO READ | మరో పేపర్ లీక్! ఈసారి పారామెడికల్ పేపర్లు..రాజస్థాన్ RPMC ఎగ్జామ్ రద్దు
దుకాణం లోపల.. చుట్టుపక్కల అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అనుమానితులలో ఒకరు తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముసుగు ధరించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
అదే రోజు రాత్రి.. బీజ్ గోడమ్ చౌక్ సమీపంలోని సాన్వరియా మొబైల్ అనే మరో మొబైల్ షాపులో కూడా ఇదే ముఠా చోరీకి యత్నించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీలో కూడా.. మోదీని పోలిన ముసుగు ధరించిన అదే వ్యక్తి పారిపోయే ముందు షాపు షట్టర్ తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించినట్లు సీసీ కెమెరా విజువల్స్లో స్పష్టంగా కనిపించింది.
