ఎంత మందిని నాశనం చేద్దామనుకున్నార్రా..! ఖమ్మం జిల్లాలో రూ. రెండున్నర కోట్ల గంజాయి బస్తాలు చూసి పోలీసులు షాక్

ఎంత మందిని నాశనం చేద్దామనుకున్నార్రా..! ఖమ్మం జిల్లాలో రూ. రెండున్నర కోట్ల గంజాయి బస్తాలు చూసి పోలీసులు షాక్

పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా.. కొందరు గంజాయి స్మగ్లింగే జీవనోపాధిగా మలచుకుంటున్నారు. సినిమా తరహాలో కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగించి ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. లేటెస్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీ కంటైనర్ లో సీక్రెట్ రూమ్ ఒకటి ఏర్పాటు పోలీసుల కళ్లుగప్పి రెండున్నర కోట్ల రూపాయల విలువైన గంజాయిన ట్రాన్స్ పోర్ట్ చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

2026 జూన్ 30వ తేదీన ఈగల్ ఫోర్స్ టీమ్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో రెండున్నర కోట్ల గంజాయి రవాణా ప్లాన్ ను  భగ్నం చేశారు.  పోలీసులు చెప్పిన  వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం సరపాక ఐటీసీ వెస్ట్ గేట్ దగ్గర కంటైనర్ లారీని పోలీసులు అడ్డుకుని చెక్ చేయగా.. అందులో 525 కిలోల గంజాయి అంటే ఐదు క్వింటాళ్లకు పైనే ఉండటం చూసీ షాకయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు  రూ.2.625 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

గంజాయిని ఒడిశా అల్లూరికోట అటవీ ప్రాంతం నుంచి సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కంటైనర్ లారీలో ప్రత్యేక రహస్య రూమ్ (అర) ఏర్పాటు చేసి గంజాయిని దాచినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఓ మైనర్ ని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు ప్రధాన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు.

నిందితుల నుంచి ఒక కంటైనర్ లారీ, బజాజ్ పల్సర్ బైక్, ఐదు మొబైల్ ఫోన్లు, 10 వేల570 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.