OTT Review: కాంతార, విరూపాక్ష తరహాలో మరో మైథలాజికల్.. ‘తవ్వై’ ఓటీటీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

OTT Review: కాంతార, విరూపాక్ష తరహాలో మరో మైథలాజికల్.. ‘తవ్వై’ ఓటీటీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

గత రెండేళ్లుగా ఇండియన్ సినీ మేకర్స్ ఆలోచనలు మారిపోయాయి. రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆడియన్స్ను మెప్పించడానికి కొత్త డైరెక్టర్స్ క్రేజీ ఆలోచనలతో వస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఆడియన్స్ పల్స్ తెలుసుకుని వారిని ఎంగేజ్ చేయడానికి వినూత్నశైలిలో ఉత్కంఠరేపే కొత్త కథలతో ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే మైథలాజికల్, మిస్టరీ థ్రిల్లర్, హారర్ జోనర్స్ను ఎంచుకుంటున్నారు. అలాంటి ప్రయత్నంతో వచ్చిన సినిమాలే కాంతార, విరూపాక్ష, ముంజ్యా. ఇప్పుడు ఆ కోవలో వచ్చిన లేటెస్ట్ చిత్రమే ‘తవ్వై’ (Tavvai). తవ్వై అంటే హిందీలో దరిద్ర దేవత, దౌర్భాగ్య దేవి అనే అర్థాలు వస్తాయని సమాచారం. 

బాలీవుడ్లో తెరకెక్కిన ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. లక్ష్మీ దేవి, అలక్ష్మి పురాణాలు, వంశపారంపర్య శాపాలు, పవిత్రమైన రావిచెట్టు (పీపల్ ట్రీ) చుట్టూ తిరిగే నమ్మకాలను ప్రధానంగా తీసుకుని ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న‘తవ్వై’ సాధారణ హారర్ చిత్రాల మాదిరిగా కేవలం భయపెట్టే ప్రయత్నం చేయదు. ముఖ్యంగా 1800 కాలం నాటి శాపం, దేవుడు వర్సెస్ దుష్టశక్తి అన్నట్లుగా ‘తవ్వై’ కథ సాగుతుంది. కథలోని ఈ అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి.

‘తవ్వై’ కథ:

లక్ష్మీ, అలక్ష్మి పురాణాలు, వంశపారంపర్య శాపం, పవిత్రమైన రావిచెట్టు చుట్టూ అల్లుకున్న మిస్టరీ థ్రిల్లర్‌నే ‘తవ్వై’. తరతరాలుగా ఒక కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం కారణంగా విచిత్రమైన, భయానక సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ శాపం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? దానికి లక్ష్మీ-అలక్ష్మి పురాణాలతో ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కథ ముందుకు సాగుతుంది.

►ALSO READ | ‘పరాశక్తి’ రెమ్యునరేషన్లో.. రూ.8 కోట్లు ఎగ్గొట్టారని.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర !

కుటుంబ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండగా, కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఆధ్యాత్మిక విశ్వాసాలు, జానపద కథలు, అతీంద్రియ శక్తుల మేళవింపుతో సాగే ఈ చిత్రం చివరికి శాపం వెనుక దాగి ఉన్న నిజాన్ని బయటపెడుతుంది. భయపెట్టే సన్నివేశాల కంటే మిస్టరీ, పురాణాల ఆధారిత కథనంపై ఎక్కువ దృష్టి పెట్టిన ఈ సినిమా హారర్ అభిమానులకు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.

ఎలా ఉందంటే:

దర్శకులు నిర్భయ్ జారీవాలా మరియు జయేష్ వృశిరాజ్ ఉత్కంఠరేపే కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన అంశమైన పిత్ర దోషం కథకు ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. అలాగే లక్ష్మీ దేవి-అలక్ష్మి దేవి మధ్య సంఘర్షణకు సంబంధించిన పురాణ కథనాలను కూడా చిత్రంలో చక్కగా మేళవించారు.

19వ శతాబ్దంలో జీవించిన ఓ పాలకుడు చేసిన తప్పిదం కారణంగా ఒక శాపం ప్రారంభమవుతుంది. ఆ శాపం తరతరాలుగా ఒక కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ శాపం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? దాని నుంచి విముక్తి పొందగలరా? అన్న ప్రశ్నల చుట్టూనే కథ సాగుతుంది.

సినిమా ఫస్ట్ నుంచే భయపెట్టే సన్నివేశాలకు వెళ్లకుండా, నెమ్మదిగా తన ప్రపంచాన్ని నిర్మించుకుంటుంది. భయపెట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చీకటి వాతావరణం, సస్పెన్స్ కలిగించే పాత్రలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి. రావిచెట్టు చుట్టూ చూపించిన దృశ్యాలు, ఆధ్యాత్మిక చిహ్నాలు, మతపరమైన ప్రతీకలు సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ‘వా హో’, ‘తాండవ్’, ‘కాల భైరవ అష్టకం’, ‘రూహ్ కా ధాగా’, ‘బంబులియా’ వంటి పాటలు కథలో సహజంగా కలిసిపోయాయి. ఇవి కథ ప్రవాహాన్ని అడ్డుకోకుండా మిస్టికల్ భయాన్ని మరింతగా పెంచాయి.

పురాణాలు, హారర్ అంశాలను కలిపిన విధానం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. సాధారణంగా కనిపించే హాంటెడ్ హౌస్ కథలకు భిన్నంగా ఉండటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. అయితే కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదిగా సాగడం, మరికొన్ని సన్నివేశాల్లో ఉత్కంఠను మరింత బలంగా చూపించే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది.