ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంక్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద మాజీ ఎన్నికల కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్‌ను తమ నూతన పార్ట్-టైమ్ చైర్మన్‌గా నియమించింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 2024 ఎన్నికల్లో దేశంలో మూడోసారి బీజేపీ సర్కార్ గద్దెనెక్కించిన లోక్ సభ ఎన్నికలు నిర్వహించింది ఈయనే. పరిపాలనా రంగంలో అనుభవమున్న రాజీవ్ కుమార్.. జూన్ 30 నుండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా చేరనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తుది ఆమోదం లభించిన తర్వాత మూడేళ్ల కాలపరిమితికి ఈయన చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు.
ఎవరీ రాజీవ్ కుమార్?
యూపీలోని హసన్ పూర్ ప్రాంతంలో జన్మించిన రాజీవ్.. ఝార్ఖండ్ క్యాడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ రంగంలో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. భారతదేశపు 25వ సీఈసీగా పనిచేయడానికి ముందు, ఆయన 2017 నుండి 2020 వరకు కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా సేవలందించారు. ఆ సమయంలో భారత బ్యాంకింగ్ రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న మొండి బకాయిల సంక్షోభాన్ని పరిష్కరించిన ఘనత ఈయనకే దక్కుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పారదర్శకతను పెంచడంతో పాటు, ఎన్‌పీఏల కోసం కఠినమైన నిబంధనలను తెచ్చారు. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ‘4R స్ట్రాటజీ’ (రికగ్నిషన్, రిజల్యూషన్, రీక్యాపిటలైజేషన్, రిఫార్మ్స్) ప్రభుత్వ బ్యాంకులను మళ్లీ లాభాల బాట పట్టించింది. దీని ద్వారానే దేశంలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 పెద్ద సంస్థలుగా విలీనమయ్యాయి.
►ALSO READ | టాటా ఎలక్ట్రానిక్స్‌పై సైబర్ అటాక్.. లాంచ్‌కు ముందే డార్క్ వెబ్‌లో లీకైన ‘ఐఫోన్ 18 ప్రో’ సీక్రెట్స్
వివాదాలు - సవాళ్లు..
బ్యాంకింగ్ రంగంలో రాజీవ్ కుమార్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ.. సీఈసీగా ఆయన పదవీకాలం వివాద రహితంగా ఏమీ సాగలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్ల జాబితాలో అక్రమాలపై వచ్చిన ఆరోపణలను రాజీవ్ కుమార్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, భారత ప్రజాస్వామ్య ప్రక్రియ పారదర్శకతను గట్టిగా సమర్థించారు. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో గవర్నెన్స్, నైతిక విలువల కారణాలు చూపుతూ ఈ ఏడాది ప్రారంభంలో రాజీనామా చేసిన అటాను చక్రవర్తి స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టబోతుండటం విశేషం.
మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్..
బ్యాంకింగ్ సంస్కరణల్లో సిద్ధహస్తుడైన రాజీవ్ కుమార్ రాకతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు స్టాక్ మార్కెట్లో క్రేజీగా రియాక్ట్ అయింది. ఈ నియామక ప్రకటన వెలువడిన వెంటనే ఇన్వెస్టర్లలో భారీ నమ్మకం వ్యక్తమైంది. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్, ఈ భారీ అప్‌డేట్‌తో మార్కెట్ ప్రారంభంలోనే లాభాల బాట పట్టింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌లోకి పవర్‌ఫుల్ అడ్మినిస్ట్రేటర్ వస్తున్నారనే సానుకూల సంకేతాలతో ట్రేడర్లు షేర్లను కొనుగోలు చేశారు. ఈ జోష్‌తో బ్యాంక్ షేరు ఇంట్రాడేలో మంచి వృద్ధిని నమోదు చేసింది. కొత్త చైర్మన్ నాయకత్వంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అందుకుంటుందని మార్కెట్ భావిస్తోంది.
