టాటా ఎలక్ట్రానిక్స్‌పై సైబర్ అటాక్.. లాంచ్‌కు ముందే డార్క్ వెబ్‌లో లీకైన ‘ఐఫోన్ 18 ప్రో’ సీక్రెట్స్

టాటా ఎలక్ట్రానిక్స్‌పై సైబర్ అటాక్.. లాంచ్‌కు ముందే డార్క్ వెబ్‌లో లీకైన ‘ఐఫోన్ 18 ప్రో’ సీక్రెట్స్

టెక్ దిగ్గజం ఆపిల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రేంజ్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ సైబర్ అటాక్ జరిగింది. ఆపిల్ ఇండియా సప్లయర్ అయిన 'టాటా ఎలక్ట్రానిక్స్'పై వరల్డ్ లీక్స్ అనే ప్రమాదకరమైన రాన్సమ్‌వేర్ గ్యాంగ్ పంజా విసిరింది. దాదాపు 2 లక్షలకు పైగా అత్యంత రహస్య ఫైళ్లను, 630 జీబీ డేటాను దొంగిలించి ఏకంగా డార్క్ వెబ్‌లో పెట్టేసింది. ఈ డేటా లీక్‌లో అసలైన షాకింగ్ విషయం ఏంటంటే.. ఇంకా మార్కెట్లోకి రాని, ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కావాల్సిన ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘ఐఫోన్ 18 ప్రో’ సీక్రెట్స్ అన్నీ బట్టబయలయ్యాయి.  

ఆపిల్ తన సప్లై చైన్ నెట్‌వర్క్‌ను, ఏ విడిభాగాన్ని ఏ కంపెనీ తయారు చేస్తుందనే విషయాన్ని ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా ఉంచుతుంది. కానీ ఈ సైబర్ దాడి వల్ల ఐఫోన్ 18 ప్రో మెయిన్ సర్క్యూట్ బోర్డ్ చిప్స్, బ్యాటరీ డిజైన్లు, కెమెరా మోడ్యూల్స్ ఏయే గ్లోబల్ కంపెనీల నుంచి వస్తున్నాయో తెలిపే కంప్లీట్ మ్యాపింగ్ బయటకు వచ్చేసింది. దీనితో పాటు ఐఫోన్ తయారీకి వాడే క్వాల్‌కామ్, టీఎస్‌ఎంసీ వంటి దిగ్గజ సంస్థల డాక్యుమెంట్లు, టెస్లా కార్ల విడిభాగాల డిజైన్లు కూడా లీక్ కావడం కార్పొరేట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఆపిల్ 'కాన్ఫిడెన్షియల్' అనే వాటర్‌మార్క్‌లతో ఉన్న సుమారు ఆరు కీలక ఫైళ్లు ఇప్పుడు హ్యాకర్ల చేతిలో ఉన్నాయి.  

ఈ లీక్‌లో మరో క్రేజీ విషయం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో టాటా ప్లాంట్లలో ఐఫోన్ 18 ప్రో మోడళ్లకు చేసిన 'డ్రాప్-టెస్ట్' ఫోటోలు కూడా డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. 3 వెనుక కెమెరాలతో, గ్రే కలర్‌లో, సాంప్రదాయ స్లాబ్ డిజైన్‌లో ఉన్న ఐఫోన్ 18 ప్రో అసలు రూపం ఈ ఫోటోల ద్వారా లీక్ అయిపోయింది. ఇప్పటివరకు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఒక ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌హౌస్‌గా మార్చాలనే ప్రధాని మోడీ ఆశయాలకు, ఆపిల్ నమ్మకానికి ఈ సైబర్ అటాక్ ఒక పెద్ద బ్రేక్ వేసినట్లయింది. గ్లోబల్ ఐఫోన్ ఉత్పత్తిలో భారత్ వాటా 26 శాతానికి చేరబోతున్న వేళ ఈ భద్రతా లోపం బయటపడటం ఆపిల్, టాటా బంధానికి పెద్ద పరీక్షగా మారింది.

ALSO READ : ‘‘ఆ పూణే అబ్బాయికి జుట్టు లేదు. ఇలాంటి అబద్ధాలు చెబితే చచ్చిపోతారు’’..

ప్రస్తుతం ఆపిల్ ఈ వ్యవహారంపై సుదీర్ఘ దర్యాప్తు జరుపుతుండగా.. టాటా ఎలక్ట్రానిక్స్ తన అంతర్గత సెన్సిటివ్ సిస్టమ్స్‌కు యాక్సెస్‌ను పూర్తిగా నియంత్రించింది. అలాగే ఈ సైబర్ దాడి వెనుక ఉన్న లోపాలను గుర్తించడానికి ఒక అంతర్జాతీయ కన్సల్టెంట్‌ను నియమించి ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహిస్తోంది. ఒకవైపు మెమొరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరిగి ఐప్యాడ్, మ్యాక్‌బుక్ రేట్లు ఇప్పటికే పెరిగాయి. త్వరలోనే ఐఫోన్ ధరలు కూడా పెరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఐఫోన్ 18 ప్రో సీక్రెట్స్, సప్లయర్స్ లిస్ట్ డార్క్ వెబ్‌లోకి వెళ్ళిపోవడం వల్ల ఆపిల్ ప్రత్యర్థులకు, నకిలీ ఫోన్లు తయారు చేసే వారికి ఒక పెద్ద జాక్‌పాట్ దొరికినట్లయింది.