నల్గొండ జిల్లాలో అన్ లోడ్ కాని వందల లారీలు..

నల్గొండ జిల్లాలో అన్ లోడ్ కాని వందల లారీలు..
  •  సెంటర్లలో భారీగా వడ్ల కుప్పలు
  •     మిల్లుల్లో పాత సీజన్ల వడ్లు, బియ్యం స్టాక్​

యాదాద్రి, వెలుగు: యాసంగి సీజన్‌‌‌‌లో వడ్ల కొనుగోలు వివిధ కారణాల వల్ల జాప్యం అవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం, లోడింగ్‌‌ ప్రక్రియ కొంత వేగంగా సాగుతున్నప్పటికీ, వడ్లతో మిల్లులకు వెళ్లిన లారీలు తిరిగి రావడానికి రోజుల సమయం పడుతోంది. మిల్లుల్లో గత సీజన్లకు చెందిన వడ్లు, బియ్యం నిల్వలు ఎక్కువగా ఉండటంతో నిల్వ స్థల సమస్య ఏర్పడింది. దీనికి తోడు హమాలీల కొరత కూడా ఉండటంతో అన్‌‌లోడ్‌‌ ప్రక్రియ ఆలస్యమవుతోంది. 

యాదాద్రి జిల్లాలో ఈ సీజన్‌‌లో 3.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 6.92 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4.50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని భావిస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల గడిచినా ఇప్పటివరకు 15 వేల మంది రైతుల నుంచి 1.35 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయడం, లోడింగ్‌‌ ప్రక్రియ వేగంగా ఉన్నప్పటికీ మిల్లులకు వెళ్లిన లారీలు అక్కడే నిలిచిపోతున్నాయి. మిల్లుల్లో గత యాసంగి సీజన్‌‌కు చెందిన 86 వేల టన్నుల వడ్లు, వానాకాలం సీజన్‌‌కు చెందిన 2.11 లక్షల టన్నుల వడ్ల నిల్వలు ఇంకా ఉన్నాయి.  జిల్లాలోని నాగరెడ్డిపల్లిలో 50 వేల టన్నుల సామర్థ్యం గల ఎఫ్‌‌సీఐ గోదాం ఉంది. 

అయితే వ్యాగన్లు ఆలస్యంగా రావడం వల్ల ఈ గోదాంలో సీఎంఆర్‌‌ స్టాక్‌‌ నిల్వగా ఉండిపోతోంది. దీంతో మిల్లుల నుంచి సీఎంఆర్‌‌ సరఫరా ఆలస్యమవుతూ, మిల్లుల్లో నిల్వ స్థల సమస్య మరింత పెరుగుతోంది. జిల్లాలోని 360 కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు దాదాపు 4 వేల మంది వరకు ఉన్నారని సమాచారం. కానీ మిల్లుల్లో మాత్రం 500 మందికి కూడా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. హమాలీలుగా ఎక్కువగా బిహార్‌‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. స్థానికంగా హమాలీల సంఖ్య తక్కువగా ఉండటంతో మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అన్‌‌లోడ్‌‌ కాకుండా నిలిచిపోతున్నాయి.

మిల్లుల్లో 400కు పైగా లారీలు

ఈ సీజన్‌‌లో సీఎంఆర్‌‌ కేటాయింపు పొందిన 39 మిల్లులు వడ్లను దించుకుంటున్నాయి. అయితే ఈ మిల్లుల్లో ప్రస్తుతం 400కు పైగా లారీలు అన్‌‌లోడ్‌‌ కాకుండా నిలిచిపోయాయి. కొన్ని మిల్లుల్లో ఒక్కోచోట 30 నుంచి 40 లారీలు వరకూ నిలిచిన పరిస్థితి ఉంది.  కొనుగోలు కేంద్రాలకు లారీలు తిరిగి రావడం తగ్గిపోయి, వడ్ల కొనుగోళ్లు ఆశించిన వేగంలో జరగడం లేదు. 

ఇదిలా ఉండగా జిల్లాలోని వ్యవసాయ శాఖకు చెందిన మధ్యంతర గోదాముల్లో ఖాళీ స్థలం ఉన్నట్టు సివిల్‌‌ సప్లైస్‌‌ అధికారులు గుర్తించారు. ఒక్కో మండలంలో 2,500 నుంచి 5,000 టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి. వీటిలో మొత్తం 25 వేల టన్నుల వరకు నిల్వ సామర్థ్యం ఉందని, అవసరమైతే ఈ గోదాములను వడ్ల నిల్వ కోసం వినియోగిస్తామని అధికారులు తెలిపారు.