పర్సంటేజ్‌‌ షేరింగ్‌‌కు రెడీ.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు

పర్సంటేజ్‌‌ షేరింగ్‌‌కు రెడీ.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు

టాలీవుడ్‌‌‌‌ను కుదిపేస్తున్న థియేటర్స్‌‌ పర్సెంటేజీ వివాదానికి తెరపడింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌‌ ప్రొడ్యూసర్స్‌‌ మధ్య నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఛాంబర్ ప్రెసిడెంట్‌‌ దగ్గుబాటి సురేష్‌‌ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌‌, ఎగ్జిబిటర్స్‌‌ కలిసి చర్చించారు.

అనంతరం  సురేష్ బాబు స్పందిస్తూ ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశామని,  త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించారు. మూడు సెక్టార్స్‌‌తో ఒక్కో సెక్టార్‌‌‌‌ నుంచి ఏడుగురు సభ్యులను ఎంపిక చేశామని, రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుందని నిర్మాత సి.కళ్యాణ్ తెలియజేశారు.

ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానంపై నిర్మాతలు సానుకూలంగా స్పందించారని, అయితే ఏ,బీ,సీ సెంటర్స్‌‌లో ఎలా ఉండాలనేది నిర్ణయించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని దిల్ రాజు చెప్పారు. అలాగే జూన్‌‌ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమా విడుదల కానుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్స్‌‌, ఎగ్జిబిటర్స్‌‌తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, కేఎల్‌‌ నారాయణ, కె.అశోక్ కుమార్, చదలవాడ శ్రీనివాస్, సునీల్ నారంగ్, నాగవంశీ, చెరుకూరి సుధాకర్, సాహు గారపాటి,  వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.