హైదరాబాద్ స్థాయిలో స్కిల్ డెవలప్‌‌ మెంట్ ప్రోగ్రామ్స్ : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

హైదరాబాద్ స్థాయిలో  స్కిల్ డెవలప్‌‌ మెంట్ ప్రోగ్రామ్స్ : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
  •     కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: హైదరాబాద్ స్థాయిలో కరీంనగర్ జిల్లాలో యువతకు స్కిల్ డెవలప్‌‌మెంట్, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. జిల్లా లైబ్రరీలో ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు అవసరమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  గ్రంథాలయ దినోత్సవంలో భాగంగా శుక్రవారం మేయర్  కె.శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్‌‌తో కలిసి బుక్ ఎగ్జిబిషన్‌‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగానికి అవసరమైన మౌలిక వసతులు, వనరులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ శిక్షణ కోసం యువత హైదరాబాద్‌‌కు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేలా జిల్లాలోనే ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు  పాల్గొన్నారు.

కలెక్టర్ మేడమ్​.. మక్కలు కొనేలా చూడండి!

జమ్మికుంట, వెలుగు: ‘మక్కలు అమ్మడానికి వచ్చి పది రోజులవుతోంది.. అధికారులు జాప్యం చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని.. మీరైనా మా సమస్యను పట్టించుకోండి మేడమ్​’ అంటూ రైతులు జమ్మికుంట పట్టణంలోని మక్కలు కొనుగోలు పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్ చిత్రా మిశ్రా వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. గన్నీ సంచులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కాంటా అయిన మక్కలను తరలించడంలో హమాలీలు లేక జాప్యం జరుగుతుండడంతో ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.