- ఆరేండ్ల సర్వీస్ తర్వాత రెగ్యులర్ సైనికులుగా చాన్స్
- తొలి బ్యాచ్‌లోని 18 వేల మందికి తక్షణ ప్రయోజనం
- కేంద్ర కేబినెట్ ఆమోదం.. సీడీఎస్ రాజా సుబ్రమణి వెల్లడి
న్యూఢిల్లీ: అగ్నివీర్ల నియామక విధానంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. నాలుగేండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న అగ్నివీర్‌లకు మరో రెండేళ్ల పాటు సైన్యంలో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆరేండ్ల సర్వీసు తర్వాత అర్హతలు, సైన్యంలో కొనసాగేందుకు ఆసక్తి చూపే వారికి రెగ్యులర్ సైనికులుగా నియమించనుంది.
ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
75 శాతం మందికి అవకాశం
2022 జూన్‌లో అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నాలుగేండ్ల పాటు పనిచేసేందుకు యువతను అగ్నివీర్‌లుగా సైన్యంలోకి తీసుకున్నారు. ఈ నాలుగేండ్ల కాలం పూర్తయ్యాక వీరిలోని 25 శాతం మంది ప్రతిభ ఆధారంగా త్రివిధ దళాల శాశ్వత కేడర్‌కు ఎంపిక అవుతారు.
మిగిలిన 75 శాతం మంది సర్వీసు నుంచి బయటకు రావాల్సి వచ్చేది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ 75 శాతం మందికి మరో రెండేండ్ల సర్వీసు దక్కనుంది. వీరిలో ఎవరికైతే నాలుగేండ్ల సర్వీసు పూర్తయిందో వారిని సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ ఏడాదికి 25 శాతం మంది చొప్పున రెగ్యులర్ సైనికులుగా ఎంపిక చేస్తారు.
18 వేల మందికి తక్షణ ప్రయోజనం
అగ్నిపథ్‌లో మార్పులతో నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 18 వేల మంది అగ్నివీర్‌లకు తక్షణ ప్రయోజనం చేకూరనుంది. వీరందరికీ అదనపు సర్వీసు లభించనుంది. ప్రస్తుతం అగ్నిపథ్ కింద ఎంపికై మూడు లక్షల మందికి పైగా సైనికులు విధుల్లో ఉన్నారు.
డేటా అప్‌గ్రేడ్‌కు రూ.4,371 కోట్లు
దేశంలో అధికారిక గణాంక వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.4,371.1 కోట్లతో రూపొందించిన ‘విస్తార్’ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2030-31 వరకు ఐదేండ్లు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. కాగా, దేశంలో విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం రూ.14,500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని కూడా ప్రకటించింది.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల బలోపేతం
మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 850 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులను కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది.
అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించడమే ఈ నిర్ణయం లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుత చట్టాలను సమర్థవం తంగా అమలుచేస్తూ, అవసరమైన కొత్త చట్టాలను రూపొందించే ప్రయత్నాల్లో భాగం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
