- వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ
- ఈ నెల 19కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ: 'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్' లోని సెక్షన్ 16 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని సీఈసీ, ఈసీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీఈసీ, ఈసీలకు నోటీసులు కూడా జారీ చేసింది. చిన్న చిన్న పొరపాటులకే అత్యంత విలువైన ఓటు హక్కును శాశ్వతంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని నిలదీసింది. పొరపాట్లు జరగకుండా ఓటర్లను చైతన్యపరచాలే తప్ప ఓటు హక్కును దూరం చేయడం కరెక్ట్ కాదని సూచించింది.
చట్టపరమైన చర్యల నుంచి సీఈసీ, ఈసీలకు కల్పించిన మినహాయింపు(బ్లాంకెట్ ఇమ్యూనిటీ)ను సవాల్ చేస్తూ ఇటీవల పిల్ దాఖలైంది. దాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చి, జస్టిస్ మోహన్ బెంచ్ బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..2023లో పార్లమెంటు ఆమోదించిన 'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్' లోని సెక్షన్ 16 కింద సీఈసీ, ఈసీలకు కల్పించిన మినహాయింపులు కరెక్ట్ గా లేవని కోర్టుకు తెలిపారు.
సీఈసీ, ఈసీలు తమ అధికార పరిధిని దాటి చేసిన చర్యలకు కూడా సెక్షన్ 16 చట్టపరమైన రక్షణ కల్పిస్తోందని వాదించారు. ఈ సెక్షన్ ప్రకారం.. సీఈసీ, ఈసీలు తీసుకున్న ఏ నిర్ణయంపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండాపోయిందని తెలిపారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కాపాడటమంటే దాని సభ్యులకు జవాబుదారీతనం లేకుండా రక్షణ కల్పించడం కాదన్నారు. సెక్షన్ 16ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. కోర్టు స్పందిస్తూ..సెక్షన్ 16పై దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సీఈసీ, ఈసీలకు నోటీసులిచ్చింది.
పాత ఓటర్లను ఫారం-6 నింపమనడం సరికాదు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై కూడా సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఎలాంటి ఎన్నికలు లేకున్నా ఢిల్లీలో సర్ ప్రక్రియను అత్యవసరంగా ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. చిన్న నిర్లక్ష్యానికి ఓటర్ల ఓటు హక్కును శాశ్వతంగా తొలగించి శిక్షిస్తారా అని నిలదీసింది. ముసాయిదా జాబితాలో పేర్లు లేని పాత ఓటర్లను మళ్లీ ఫారం-6 నింపమని అడగడం సరికాదని అభిప్రాయపడింది. ఈ మొత్తం అంశాలపై తదుపరి విచారణను ఈ నెల19కి వాయిదా వేస్తూ, సర్ గడువు పొడిగింపుపై పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
