జనగామ అర్బన్, వెలుగు : మక్కలు, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గన్నీ బ్యాగుల నిల్వలు, హమాలీల అందుబాటు, గోదాముల సామర్థ్యం, రవాణా, తదితర వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీవో కోదండరాములు తదితరులు పాల్గొన్నారు.
