- పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు
- ఉపసర్పంచులకు చెక్‌పవర్‌ను వ్యతిరేకిస్తున్న సర్పంచులు
- నిధుల డ్రాలో జాప్యంతో పనులు ఆగిపోతున్నాయనే ఫిర్యాదులు
- రాజకీయ విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా పంచాయతీరాజ్‌శాఖ
- ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య సాగుతున్న ‘చెక్ పవర్’ వార్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించింది. 2018కి ముందు పంచాయతీల్లో నిధుల డ్రా కోసం సర్పంచ్‌కు, సెక్రటరీకి జాయింట్ చెక్‌పవర్ ఉండగా, బీఆర్ఎస్ సర్కారు సెక్రటరీ స్థానంలో ఉపసర్పంచ్‌ను చేరుస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది.
దీని వల్ల గ్రామాల్లో రాజకీయ విభేదాలు తలెత్తుతుండడం, నిధుల డ్రాలో జాప్యం వల్ల పనులు నిలిచిపోతుండడంతో చట్టసవరణ చేయాలని ప్రభుత్వానికి తాజాగా పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు పంపించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ కొనసాగించడాన్ని సర్పంచులు తప్పు పడ్తుండగా, ఒకవేళ తొలగిస్తే ఉప సర్పంచుల నుంచి ఆందోళనలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈక్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. పంచాయతీల్లో రాజకీయ విభేదాలు
రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య రాజకీయ విభేదాలు తీవ్రమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సర్పంచ్‌స్థానాలు రిజర్వ్అయిన పంచాయతీల్లో జాయింట్చెక్పవర్కారణంగా అగ్రవర్ణాలకు చెందిన ఉపసర్పంచ్లు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి.
గ్రామంలో ఏ చిన్న ఖర్చు చేయాలన్నా.. పంచాయతీ నిధులు డ్రా చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి. కానీ సర్పంచ్, ఉప సర్పంచ్ ల నడుమ కుల, వర్గ, పార్టీల పోరు కారణంగా నిధుల డ్రా విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో అనేక పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులు ఆగిపోతున్నాయి. చాలా గ్రామాల్లో ఉప సర్పంచులు కావాలనే సంతకాలు పెట్టడం లేదని, కమీషన్లు డిమాండ్‌చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్నదని సర్పంచుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి.
ఈ క్రమంలో స్ట్రీట్లైట్ల రిపేర్లు, మురుగు కాల్వల్లో పూడికతీత, ఇతర అత్యవసర పనులకు నిధులున్నా.. ఇద్దరి మధ్య సయోధ్య లేక బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి సకాలంలో యూటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) సమర్పించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి నిధుల విడుదల ఆలస్యమవుతున్నదని అధికారులు చెప్తున్నారు. దీంతో గతంలో మాదిరి ఉప సర్పంచుల స్థానంలో కార్యదర్శులకు చెక్పవర్అప్పగిస్తే బాధ్యతాయుతంగా ఉంటుందని పంచాయతీరాజ్ఆఫీసర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
- చట్ట సవరణ తప్పదా?
పంచాయతీల్లో చెక్‌పవర్ అంశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. పొరుగున ఉన్న ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్పంచ్ తోపాటు పంచాయతీ కార్యదర్శి, లేదంటే పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కు జాయింట్ చెక్‌పవర్ ఉంది. తెలంగాణలో కూడా 2018కి ముందు ఇదే పద్ధతి అమల్లో ఉండేది. కానీ, గత ప్రభుత్వం రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఉప సర్పంచులకు ఈ అధికారాన్ని కట్టబెట్టింది. మన రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఖాతా నుంచి పైసా తీయాలన్నా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు ఉండాలి.
తాజాగా.. ఉప సర్పంచ్స్థానంలో పంచాయతీ సెక్రటరీకి జాయింట్చెక్పవర్ ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించింది. దీంతో రాజకీయ ప్రతినిధిగా సర్పంచ్, ప్రభుత్వ ప్రతినిధిగా కార్యదర్శి ఇద్దరూ నిధులను పర్యవేక్షించనున్నారు. తద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడటంతోపాటు చెక్ పవర్ కోసం జరిగే గొడవలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయాలంటే కేవలం జీవో ఇస్తే సరిపోదని, ప్రభుత్వం అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
అసెంబ్లీ సమావేశాలు లేని పక్షంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలుచేసే అవకాశముంది. కాగా, పంచాయతీ అధికారుల నిర్ణయంపై సర్పంచుల సంఘం హర్షం వ్యక్తం చేస్తుండగా, తమకున్న ఏకైక అధికారాన్ని తొలగిస్తే తమ పదవికి విలువ ఉండదని ఉప సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఉప సర్పంచ్ పదవికి చెక్ పవర్ఉండడంతో రూ.లక్షలు ఖర్చు చేసి వార్డు మెంబర్ల మద్దతు కూడగట్టుకున్నామని.. ఇప్పడు తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఉప సర్పంచులు హెచ్చరిస్తున్నారు.
