అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సతీష్ కాసెట్టి తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’. రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. వెంకటలక్ష్మీ అనే రూరల్ అమ్మాయిగా కనిపించిన అనుపమ.. సంజూ (విరాజ్ అశ్విన్)ను యూఎస్ నుంచి వచ్చిన ఎన్నారై మరీచిక (రెజీనా కసాండ్రా) చంపేసిందంటూ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ ఘోష్ కనిపించారు.
‘మరీచిక’ అంటే ఎండమావి అని అర్థం. అందుకు తగ్గట్టుగానే ఒక పాత్రకు మరో పాత్రతో సంబంధం ఉంది అన్నట్టుగా ఒకసారి, అసలు అలాంటి వ్యక్తే లేరు అన్నట్టుగా మరోసారి చూపించిన విధానం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూడు పాత్రలు చెప్పే విషయాల్లో ఏది నిజం, ఏది కల్పితం అనే ట్విస్టులతో ఎమోషన్స్, మిస్టరీ అంశాలు కలగలిసిన సైకలాజికల్ రివెంజ్ డ్రామాగా ఈ చిత్రం థ్రిల్ చేయబోతోందని అర్థమవుతోంది.
