విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ ఏదైనా ఉంటే అది ఇంటర్మీడియట్ విద్య. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, వృత్తి జీవితానికి వారధిగా నిలిచేది ఈ దశ. ఇలాంటి కీలకమైన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం సమయోచితమైనదే కాక భవిష్యత్ తరాల కోసం అవసరమైన ముందడుగుగా చెప్పాలి. దశాబ్దాలుగా కొనసాగుతున్న బట్టీ పద్ధతులు, మార్కుల కోసం మాత్రమే జరిగే పోటీ, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్న సంస్కరణలు విద్యా రంగంలో కొత్త అధ్యాయం అవుతుంది.
ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్య అంటే ఎక్కువగా పుస్తకాల పఠనం, బట్టీ పట్టడం, పరీక్షల్లో మార్కులు సాధించడం అనే ఒకే దారిలో సాగింది. కానీ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేవలం జ్ఞాపకశక్తి ఆధారిత విద్యతో కాదు, విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, ప్రయోగాత్మక నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలు కలిగిన యువతనే ప్రపంచం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు విద్యార్థులను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేసే ప్రయత్నంగా చూడాలి.
విద్యార్థుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం
ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఇప్పటివరకు రెండో సంవత్సరంలో మాత్రమే ఉండే ప్రాక్టికల్స్‌ను ఇకపై మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయం. ఫస్ట్ ఇయర్‌లో 15 మార్కులు, సెకండ్ ఇయర్‌లో 15 మార్కులు కేటాయించడం ద్వారా విద్యార్థులు మొదటి నుంచే ప్రయోగాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇంతకాలం సబ్జెక్టును కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే చదివిన విద్యార్థులు ప్రయోగశాలల్లో అనుభవం పొందడం ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోగలరు.
భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ అవగాహన లేకుండా ఉన్నత విద్యలో ముందుకుసాగడం కష్టమనే విషయం తెలిసిందే. గణితంలో కూడా ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు 75 మార్కులకు ఉండే రాత పరీక్షను 60 మార్కు లకు పరిమితం చేసి, మిగిలిన 15 మార్కులను ఏబీఎల్ ( ఆక్టివిటీ బేస్డ్ లెర్నింగ్)కు కేటాయించడం విద్యార్థుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం. గణితం అంటే కేవలం సూత్రాలు బట్టీ పట్టడం కాదు. వాటి ఉపయోగాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమనే భావనను ఈ విధానం బలపరుస్తుంది. ప్రాజెక్టులు, ప్రదర్శనలు, కార్యకలాపాల ద్వారా గణితంపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
డిజిటల్ ఫైనాన్స్ వంటి అంశాలపై అవగాహన
ఇతర గ్రూపుల్లో కూడా 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ప్రాక్టికల్ విధానం ప్రవేశపెట్టడం విద్యను మరింత సమగ్రంగా మార్చే చర్య. ముఖ్యంగా కామర్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఏసీఈ వంటి గ్రూపుల్లో అంతర్గత పరీక్షలు, ప్రాజెక్ట్ ఆధారిత మూల్యాంకనం ఉండడం వల్ల విద్యార్థులు వాస్తవ జీవన పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశాలు పెరుగుతాయి.
ఉదాహరణకు అకౌంటెన్సీ చదివే విద్యార్థి కేవలం జర్నల్ ఎంట్రీలు రాయడమే కాకుండా బ్యాంకింగ్, టాక్సేషన్, డిజిటల్ ఫైనాన్స్ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోగలడు. భాషా సబ్జెక్టుల్లో కూడా మార్పులు తీసుకురావడం మరో విశేషం.
తెలుగు, సంస్కృతం, ఆంగ్లం వంటి భాషలకు 20 మార్కుల అంతర్గత మూల్యాంకనం ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల్లో రచనా సామర్థ్యం, భాషా వినియోగం మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు పరీక్షల కోసం మాత్రమే పాఠ్యాంశాలను చదివే పరిస్థితి ఉండేది. కానీ అంతర్గత పరీక్షల ద్వారా నిరంతర అధ్యయనం, సృజనాత్మక రచన, సంభాషణా నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే ఈ సంస్కరణలు విజయవంతం కావాలంటే కేవలం విధాన మార్పులు సరిపోవు. వాటిని సమర్థవంతంగా అమలుచేయడం అత్యంత ముఖ్యమైన విషయం.
గ్రామీణ ప్రాంత ప్రభుత్వ కళాశాలల్లో సరిపడా ప్రయోగ శాలలు, పరికరాలు, నిపుణులైన ఉపాధ్యాయులు లేకపోతే ఈ మార్పులు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం ముందుగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడకుండా అవసరమైన వనరులను ప్రభుత్వం అందించాలి.
మూల్యాంకనంలో పారదర్శకత
మరో ముఖ్యమైన అంశం మూల్యాంకనంలో పారదర్శకత. అంతర్గత పరీక్షలు, ప్రాజెక్ట్ మార్కులు వంటి అంశాల్లో ఎటువంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉంటుంది. లేదంటే ప్రైవేట్ కళాశాలలు మార్కుల పోటీలో మరోసారి దుర్వినియోగాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కాబట్టి కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. ఈ సంస్కరణలతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఒకే తుది పరీక్ష ఆధారంగా భవిష్యత్తు నిర్ణయించబడేది. ఇప్పుడు నిరంతర మూల్యాంకనం ఉండడం వల్ల విద్యార్థులు చదువును అర్థం చేసుకుంటూ ముందుకు సాగగలరు.
ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మొత్తానికి ప్రభుత్వం తీసుకొస్తున్న ఇంటర్మీడియట్ విద్యా సంస్కరణలు విద్యను మార్కుల పరిమితి నుంచి బయటకు తీసుకువచ్చి నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచనా శక్తి వైపు మళ్లించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం పరీక్షల మార్పు కాదు. భవిష్యత్ భారత నిర్మాణానికి బలమైన పునాది వేయాలనే దిశగా తీసుకున్న నిర్ణయం. సరైన అమలు, సమగ్ర పర్యవేక్షణ, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉంటే ఈ మార్పులు విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాదు, సమాజ ప్రగతిని కూడా కొత్త దిశలో నడిపించగలవు.
తిప్పర్తి శ్రీనివాస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
