- స్టూడెంట్లకు సీక్రెట్ కోచింగ్పేరిట లక్షల రూపాయలకు ప్రశ్నల అమ్మకం
- ఇప్పటివరకు 9 మంది అరెస్ట్
న్యూఢిల్లీ/పుణె: నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో కీలక వ్యక్తిని పట్టుకుంది. పుణేలోని మోడర్న్ కాలేజీలో పనిచేస్తున్న బోటనీ ప్రొఫెసర్ మనీషా మాంధారేను ఢిల్లీలో శనివారం అరెస్ట్ చేశారు. ఆమె నేషనల్ టెస్టింగ్‌ఏజెన్సీ (ఎన్టీఏ) తరపున అయిదారేండ్లుగా నీట్ పేపర్ సెట్టింగ్‌లో పాల్గొంటున్నది. 2026 నీట్‌కు బోటనీ, జువాలజీ ప్రశ్నలు ఆమెనే రూపొందించడం గమనార్హం.
ఈ కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణి దర్యాప్తు సంస్థ విచారిస్తున్నది. ఇతను కూడా నీట్ పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉన్నారు. ప్రొఫెసర్ మాంధారే ఏప్రిల్ 2026లో పుణేలో తన ఇంట్లో రహస్య కోచింగ్ క్లాసులు నిర్వహించింది. విద్యార్థులకు నీట్లో వచ్చే బోటనీ, జువాలజీ ప్రశ్నలు వివరించింది. వారితో నోట్ బుక్కుల్లో రాయించి, పుస్తకాల్లో మార్క్ చేయించి బట్టీ పట్టించింది. మే 3న జరిగిన నీట్ పరీక్షలో ఆమె చెప్పిన ప్రశ్నలు వచ్చాయి.
ఎగ్జామ్‌లో వచ్చే ప్రశ్నలు చెప్పినందుకు ఆమె వారి నుంచి రూ. లక్షలు వసూలు చేసింది. తన కోచింగ్ కోసం స్టూడెంట్లను తీతెచ్చేందుకు ఆమె వాఘ్‌మారే సాయం తీసుకుంది. వాఘ్మారేను మే 14న అరెస్టు చేశారు. కులకర్ణి కూడా ఇదే పద్ధతిలో కెమిస్ట్రీ ప్రశ్నలు లీక్ చేశారు. వీరిని 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. నీట్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు పుణే, ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్‌లతో సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది మంది అరెస్టయ్యారు.
- ఎన్టీఏ ఆఫీస్వద్ద ఎన్‌ఎస్‌యూఐ ధర్నా
నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) శనివారం ఢిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేసింది. తక్షణమే ఎన్‌టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పరీక్షల ఒత్తిడితో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని దీనికి ఎన్టీఏ, కేంద్రమే కారణమని విద్యార్థి సంఘం ఆరోపించింది.
