న్యూఢిల్లీ: భారతదేశంలో చిప్ తయారీని ప్రారంభించడానికి టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సెమీకండక్టర్ పరికరాల దిగ్గజం ఏఎస్ఎమ్ఎల్ చేతులు కలిపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో ఈ ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ల ఉత్పత్తికి కీలకమైన లితోగ్రఫీ పరికరాల విభాగంలో ఏఎస్ఎమ్ఎల్ సంస్థకు ఆధిపత్యం ఉంది.
ఈ భాగస్వామ్యం ద్వారా గుజరాత్‌లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయబోయే 300 మిల్లీమీటర్ల సెమీకండక్టర్ ఫ్యాబ్ స్థాపనకు ఏఎస్ఎమ్ఎల్ సహాయం చేస్తుంది. క్రిటికల్ టెక్నాలజీ రంగంలో భారత్, నెదర్లాండ్స్ మధ్య వ్యూహాత్మక సహకారంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు.
టాటా ఎలక్ట్రానిక్స్ రూ.91 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే మొదటి కమర్షియల్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆటోమోటివ్, మొబైల్ పరికరాలు, ఏఐ వంటి రంగాల కోసం సెమీకండక్టర్లను తయారు చేయడం దీని లక్ష్యం.
