వెండి దిగుమతులపై రిస్ట్రిక్షన్లు

వెండి దిగుమతులపై రిస్ట్రిక్షన్లు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచిన కొద్దిరోజులకే  కేంద్ర ప్రభుత్వం వెండి  దిగుమతి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటివరకు స్వేచ్ఛా దిగుమతుల జాబితాలో ఉన్న వెండిని,  రిస్ట్రిక్టడ్‌‌ కేటగిరీలోకి మారుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌‌టీ) శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీంతో ఇక నుంచి వెండిని దిగుమతి చేసుకోవాలనుకుంటే  ప్రభుత్వం నుంచి  ముందస్తు లైసెన్స్ లేదా అనుమతి  కచ్చితంగా తీసుకోవాలి.  

ఈ రిస్ట్రిక్షన్లు  99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీల (సిల్వర్‌‌‌‌ బార్ల)తో పాటు, అంతకంటే తక్కువ స్వచ్ఛత కలిగిన ఇతర వెండి కడ్డీలకు, బంగారం లేదా ప్లాటినంతో పూత పూసిన వెండి వస్తువులకు  వర్తిస్తాయి.  ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని  6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచింది. ఇందులో 10 శాతం బేసిక్‌‌ కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్  ఉన్నాయి.