జబల్‌పూర్: సామాన్యుడి బాధలను తీర్చేందుకు న్యాయవ్యవస్థ 24 గంటల ఆస్పత్రి మాదిరి పనిచేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. శనివారం మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్వహించిన " ఫ్రాగ్మెంటేషన్ టు ఫ్యూజన్, ఎంపవరింగ్ జస్టిస్ వయా యునైటెడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేషన్ " అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కోర్టుల సమయం వృథా కావొద్దంటే సాంకేతికత వాడడమే సరైన మార్గమన్నారు. ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే వేదికపై మధ్యప్రదేశ్ హైకోర్టు కొత్తగా అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఆయన ప్రారంభించారు. కోవిడ్- సమయంలో భారత న్యాయవ్యవస్థ పని తీరును ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి మేఘ్వాల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ సభర్వాల్ పాల్గొన్నారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు..
తాను చేసినట్లు చెప్తున్న 'బొద్దింకలు' వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టతనిచ్చారు. " నిన్న ఓ పనికిరాని కేసు విచారణ సందర్భంగా నేను అన్న మాటలను మీడియాలోని ఓ విభాగం తప్పుగా ప్రసారం చేయడం నన్ను ఎంతగానో బాధించింది. నకిలీ, బోగస్ డిగ్రీలతో లాయర్లుగా ప్రవేశించిన వారిని మాత్రమే నేను విమర్శించాను. అలాంటి వారే మీడియా, సోషల్ మీడియా, ఇతర పవిత్ర వృత్తుల్లోకి చొరబడి పరాన్నజీవుల్లా మారుతున్నారు. నేను మన దేశ యువతను విమర్శించాననడం పూర్తిగా నిరాధారం" అని సీజేఐ పేర్కొన్నారు.
