మాదాపూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది.. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర భారీగా ఆక్రమణలు తొలగించారు హైడ్రా అధికారులు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, మొండికుంట చెరువు సమీపంలో ఆక్రమణలపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా గురువారం ( ఫిబ్రవరి 12 ) భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా.. వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా షాపులు తొలగించారు హైడ్రా అధికారులు. మొండికుంట చెరువు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించి, 11 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
ఈ ఆపరేషన్ లో భాగంగా హైడ్రా రక్షించిన ఆస్తి విలువ సుమారు రూ. 2 వేల 200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన మెకానిక్ షెడ్లు, ఐరన్-స్టీల్ దుకాణాలు సహా పలు నిర్మాణాలను కూల్చేశారు అధికారులు. షాపుల ద్వారా నెలకు లక్షల రూపాయల అద్దెల వసూలు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. మొండికుంట చెరువు FTL పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి ఆక్రమణలు చేసినట్లు నిర్దారించారు.
ఈ ఆక్రమణలపై జనవరి 31న రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టింది హైడ్రా. NRSC శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఆక్రమణల నిర్దారించినట్లు తెలిపారు అధికారులు. కబ్జాదారులకు ముందస్తు సమాచారం, గడువు ఇచ్చిన తరువాతే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు అధికారులు.
కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఇవాళ భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. ఆక్రమణలు తొలగించిన ప్రభుత్వ భూమిలో పార్కుల అభివృద్ధి, చెరువు సుందరీకరణ చేయాలని హైడ్రా అధికారులకు విజ్ఞప్తి చేశారు స్థానికులు.
