బంగ్లా రాజకీయాల్లో సంచలనం: షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం

బంగ్లా రాజకీయాల్లో సంచలనం: షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం

బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై మహ్మమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం మాట్లాడుతూ.. అవామీ లీగ్ పార్టీపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని.. ఆ పార్టీ రాజకీయ కార్యకలాపాలు నిషేధించడంతో పాటు రాజకీయ పార్టీగా దాని రిజిస్ట్రేషన్ రద్దు చేశామని తెలిపారు. ఫలితంగా 2026, ఫిబ్రవరి 12న జరగనున్న బంగ్లా జాతీయ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ పోటీ చేయలేదని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించిన అవామీ లీగ్ పార్టీపై బ్యాన్ ఆ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

అసలేం జరిగిందంటే..?

2024 జూలై, ఆగస్ట్‎లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేశారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ప్రాణ భయంతో ఆమె దేశం విడిచిపారిపోయింది.

షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. 2024 జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అప్పటి ప్రధాని షేక్ హసీనా క్రూరంగా అణిచివేశారని ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. 

►ALSO READ | మొత్తం పాకిస్తాన్‎నే కట్నంగా అడిగేశాడు: మాజీ ప్రధాని వాజ్‎పేయి కామెడీ టైమింగ్ వేరే లెవల్ భయ్యా..!

ఈ క్రమంలోనే ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరిపి ఈ కేసులో షేక్ హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఐసీటీ తీర్పు అనంతరం ఇండియాలో తలదాచుకుంటున్న హసీనాను అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ కోరింది. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా హసీనా అవామీ లీగ్ పార్టీపై వేటు వేయడం గమనార్హం. 

అవామీ లీగ్ పార్టీ పుట్టుక:

1949, జూన్ 23న తూర్పు పాకిస్తాన్​లోని ఢాకాలో తూర్పు పాకిస్తాన్ అవామీ ముస్లిం లీగ్​ను స్థాపించారు. ఈ పార్టీ స్థాపనలో మౌలానా అబ్దుల్ హమీద్ ఖాన్  బాషా, ముజిబుర్ రెహమాన్ ముఖ్యమైన పాత్ర పోషించారు. 

లక్ష్యం

పాకిస్తాన్ పాలనలో తూర్పు బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాడటం, ప్రాదేశిక స్వయం ప్రతిపత్తిని సాధించడం ఈ పార్టీ ముఖ్య లక్ష్యాలుగా ఉండేవి. 

స్వాతంత్య్ర పోరాటం

షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అవామీలీగ్ బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించింది. 1970 ఎన్నికల్లో అవామీలీగ్ ఘన విజయం సాధించినా, పాకిస్తాన్ ప్రభుత్వం అధికారాన్ని అప్పగించకపోవడంతో 1971లో స్వాతంత్ర్య యుద్ధం జరిగింది. 

స్వాతంత్య్రం తర్వాత

1971లో బంగ్లాదేశ్​ స్వాతంత్ర్యం పొందిన తర్వాత అవామీలీగ్ దేశాన్ని పాలించిన తొలి పార్టీగా అవతరించింది. షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్​ మొదటి ప్రధాన మంత్రి అయ్యారు.