మీరు ఎప్పుడైనా పాత జ్యువెలరీ షాపులకో లేదా మీ ఊర్లోని కంసాలి దగ్గరికో వెళ్లారా? అక్కడ మీరు గమనిస్తే.. బంగారు నగలను అందమైన బాక్సుల్లో పెట్టే ముందు, వాటిని ఒక పలచని గులాబీ రంగు కాగితంలో చుట్టి ఇస్తారు. కానీ ప్రస్తుతం షోరూమ్‌లు వెల్వెట్ బాక్సులు, డిజైనర్ ప్యాకేజింగ్‌లకు మారుతున్నాయి. అసలు ఈ పింక్ పేపర్ సంప్రదాయం వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది జస్ట్ అలంకారం కోసమో లేదా సెంటిమెంట్ కోసమో చేసే పని కాదు.. దీని వెనుక ఒక బలమైన సైన్స్.. ప్రాక్టికల్ లాజిక్ దాగి ఉన్నాయనే మనలో చాలా మంది అస్సలు తెలియదు.
ఈ గులాబీ కాగితం వాడకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం గోల్డ్ వస్తువుల మెరుపును కాపాడటం అని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా బంగారం, వెండి వస్తువులు గాలిలోని తేమకు లేదా ఆక్సిజన్‌కు గురైనప్పుడు వాటి సహజసిద్ధమైన కాంతిని కోల్పోయి.. మసకబారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెండి వస్తువులు త్వరగా నల్లగా మారుతుంటాయి. ఈ పింక్ పేపర్ నగలకు.. బయటి గాలికి మధ్య ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది వాతావరణంలోని తేమను నగలకు తగలకుండా అడ్డుకోవడం ద్వారా వాటి మెరుపు ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంటాయట.
►ALSO READ | ఐటీ షేర్ల ఊచకోత: ఒక్కరోజే రూ.లక్ష కోట్లు ఆవిరి.. మార్కెట్లు దానికోసమే ఎదురుచూస్తున్నాయా..?
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మనం వాడే బంగారు నగలు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు కావు. నగలకు గట్టిదనం రావడం కోసం అందులో రాగి, వెండిని మిశ్రమ లోహాలుగా కలుపుతారు. స్వచ్ఛమైన బంగారం తుప్పు పట్టకపోయినా.. ఈ మిశ్రమ లోహాలు గాలిలోని తేమతో రియాక్ట్ అవ్వటం వల్ల రంగు మారుతుంటాయి. ఇది గోల్డ్ వస్తువుల మెరుపును తగ్గిస్తుందంట. గులాబీ రంగు కాగితంలో ఉండే ఒక రకమైన పలచని రక్షణ పూత ఈ ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇతర రంగు కాగితాల కంటే పింక్ పేపర్‌కు ఈ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఇది జ్యువెలరీ రంగంలో ఒక స్టాండర్డ్ పద్ధతిగా మారిపోయింది.
మెరుపును కాపాడటంతో పాటు.. నగలను గీతలు పడకుండా చూడటంలో కూడా ఈ కాగితం కీలక పాత్ర పోషిస్తుంది. నగలను నేరుగా డబ్బాల్లో పెట్టినప్పుడు అవి అటు ఇటు కదిలి రాపిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పేపర్ నగలను సురక్షితంగా పట్టి ఉంచుతుంది. మార్కెట్లో బ్రాండింగ్ పేరుతో ఖరీదైన ప్యాకేజింగ్‌లు వచ్చినా.. పాతకాలపు ఈ పింక్ పేపర్ పద్ధతి ఇప్పటికీ మారకపోవటం వెనుక కారణాలు ఇవే. ఇది మన పూర్వీకులు అతి తక్కువ ఖర్చుతో విలువైన వస్తువులను ఎలా కాపాడుకోవాలో నేర్పించిన అద్భుతమైన ఉదాహరణ.
