ఐటీ షేర్ల ఊచకోత: ఒక్కరోజే రూ.లక్ష కోట్లు ఆవిరి.. మార్కెట్లు దానికోసమే ఎదురుచూస్తున్నాయా..?

ఐటీ షేర్ల ఊచకోత: ఒక్కరోజే రూ.లక్ష కోట్లు ఆవిరి.. మార్కెట్లు దానికోసమే ఎదురుచూస్తున్నాయా..?

గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా అమెరికా టెక్ రంగంలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావం భారత ఐటీ షేర్లపై తీవ్రంగా పడింది. దీంతో సెన్సెక్స్ 550 పాయింట్లు పతనమై 84,650 వద్ద ముగియగా.. మరో సూచీ నిఫ్టీ 160 పాయింట్ల పైగా నష్టపోయి 25,800 స్థాయికి దిగువన స్థిరపడింది. ఏఐ రంగంలో కొత్త మార్పులు సాఫ్ట్‌వేర్ సేవలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల మధ్య ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోనూ బలహీనత కనిపించింది. గత కొద్ది రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్లకు ఈ 'టెక్ షాక్' ఒక్కసారిగా బ్రేక్ వేసింది. విదేశీ పెట్టుబడిదారులు కూడా ఆచితూచి వ్యవహరించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

నేడు ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి కంపెనీల షేర్లు ఏకంగా 5 శాతం వరకు పతనం అయ్యాయి. కేవలం ఒక్కరోజులోనే ఈ ఐదు కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.లక్ష కోట్లు ఆవిరైపోయింది. ముఖ్యంగా AI స్టార్టప్ 'ఆంత్రోపిక్' విడుదల చేసిన 'క్లాడ్ కోవర్క్' ప్లగిన్లు సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఏఐ ప్లగిన్లు లీగల్, సేల్స్, అనలిటిక్స్ వంటి పనులను నేరుగా పూర్తి చేసేస్తున్నాయి. దీనివల్ల సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీల అవసరం తగ్గుతుందనే రోజురోజుకూ పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్ వ్యాల్యూ చైన్‌ను ఏఐ దెబ్బతీస్తుందనే భయంతో అమెరికాలోని భారత ఐటీ కంపెనీల డిపాజిటరీ రిసీట్స్ 5 శాతం వరకు పడిపోయాయి, దాని ప్రభావమే నేడు మన మార్కెట్‌పై పడింది.

భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ, మార్కెట్లు కొత్త రికార్డులను తాకలేకపోతున్నాయి. మార్కెట్ల ర్యాలీకి బ్రేక్ వేస్తున్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ప్రకటన వచ్చినప్పటికీ, అది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. రష్యా నుంచి క్రూడ్ దిగుమతుల నిలిపివేత, వ్యవసాయ మార్కెట్లను తెరవడం వంటి సున్నితమైన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

* దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. హెడ్ లైన్ వార్తలు బాగున్నా.. వాస్తవంగా కంపెనీల సంపాదనలు పెరిగితేనే ఇన్వెస్టర్లు నమ్ముతారని నిపుణులు చెబుతున్నారు.

►ALSO READ | టెక్కీలకు భవిష్యత్తులో కావాల్సిన పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. సీక్రెట్ చెప్పిన Nvidia సీఈఓ

* విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. రూపాయి విలువ స్థిరపడటం, ప్రపంచవ్యాప్తంగా టెక్ షేర్లు నిలకడగా ఉండటం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

* మార్కెట్ విలువ ఇప్పటికే గరిష్ట స్థాయిల్లో ఉంది. దీనివల్ల షేర్లు మరింత పెరగడానికి తగినంత వెసులుబాటు కనిపించడం లేదు. వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోలిస్తే భారత వస్తువులకు అమెరికా మార్కెట్‌లో ఇంకా పూర్తిస్థాయి పోటీ లభించట్లేదు.

మార్కెట్ ఇంకా దేని కోసం ఎదురుచూస్తోంది..?

ప్రస్తుతానికి మార్కెట్లు కేవలం ప్రకటనల మీద కాకుండా.. వాస్తవ రూపంలో కనిపిచ్చే మార్పుల కోసం ఎదురుచూస్తున్నాయి. ట్రేడ్ డీల్ వల్ల కలిగే లాభాలు కంపెనీల బ్యాలెన్స్ షీట్లలో కనిపిస్తేనే ఇన్వెస్టర్లలో నమ్మకం బలపడుతుంది. విదేశీ పెట్టుబడులు తిరిగి రావాలి.. అలాగే ఏఐ వల్ల ఐటీ రంగానికి ముప్పు లేదని నిరూపితం కావాలి. అప్పటి వరకు మార్కెట్ అస్థిరంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మెుత్తానికి మార్కెట్లు మాటలు కాదు చేతల్లో రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తోంది.