టెక్కీలకు భవిష్యత్తులో కావాల్సిన పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. సీక్రెట్ చెప్పిన Nvidia సీఈఓ

టెక్కీలకు భవిష్యత్తులో కావాల్సిన పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. సీక్రెట్ చెప్పిన Nvidia సీఈఓ

సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెట్టాలంటే C++, Java, Python లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు నేర్చుకోవడం తప్పనిసరి అని అందరికీ తెలిసిందే. కానీ భవిష్యత్తులో వీటన్నింటి కంటే మించిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెక్కీలకు చాలా అవసరం అంట. దీనిపై ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చేసిన తాజా కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్తులో అత్యంత ప్రాచుర్యం పొందే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కాదని.. అది మన మాతృభాష లేదా ఇంగ్లీష్ అన్నారు. ఎందుకంటే ఏఐ యుగంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామర్ల కంటే ఏఐతో సంభాషించే వారి అవసరమే ఎక్కువ అంటున్నారు ఆయన.

 కంప్యూటర్లతో మనం సంభాషించే విధానం వేగంగా మారిపోతోందంటున్నారు జెన్సన్ హువాంగ్. గతంలో ఒక అప్లికేషన్ తయారు చేయాలంటే వేల లైన్ల కోడింగ్ రాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్ రావడంతో.. మనకు ఏం కావాలో స్పష్టంగా సాధారణ మాటలతో ఏఐకి చెబితే చాలు. ఏఐ సిస్టమ్స్ దానికి కావాల్సిన కోడ్‌ను వాటంతట అవే రాసేస్తున్నాయి. అంటే సింటాక్స్ నేర్చుకోవడం కంటే మన అవసరాన్ని మెషిన్‌కు స్పష్టంగా వివరించి చెప్పటం ఇప్పుడు అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారుతోందన్నమాట.

ప్రోగ్రామింగ్‌లో ఒకప్పుడు కోడ్‌లోని తప్పులను వెతకడానికి గంటల కొద్దీ సమయం పట్టేది. కానీ రానున్న రోజుల్లో.. ఏఐతో సంభాషిస్తూనే తప్పులను సరిదిద్దవచ్చని హువాంగ్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల నాన్-టెక్నికల్ వ్యక్తులు కూడా సాఫ్ట్‌వేర్లను తయారు చేసే అవకాశం కలుగుతుంది. అయితే దీని అర్థం సాంప్రదాయ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు కనుమరుగవుతాయని కాదని వాటిని మనుషులు వాడాల్సిన అవసరం భారీగా తగ్గుతుందని హువాంగ్ చెబుతున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఇప్పటికీ పైథాన్ లేదా సి++  ద్వారానే నడుస్తాయి. కానీ మనుషులకు కంప్యూటర్‌కు మధ్య ఉండే 'ఇంటర్‌ఫేస్' మాత్రం సహజమైన భాషగా మారుతుంది.

భవిష్యత్తు టెక్కీలకు కోడింగ్ స్కిల్స్ కంటే.. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏఐ ప్రాంట్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యంత అవసరమని ప్రస్తుత మార్పులు తెలియజేస్తున్నాయి. కేవలం కమాండ్లు ఇవ్వడం నుంచి మన ఆలోచనలను వ్యక్తీకరించడం వైపు టెక్ ప్రపంచం అడుగులు వేస్తోందని ఎన్వీడియా సీఈఓ కామెంట్స్ చెబుతున్నాయి.